లబ్ధిదారుల ఇష్టం మేరకే పాడి పశువుల కొనుగోలు

16 Nov, 2020 03:50 IST|Sakshi

మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం 

5.63 లక్షల పాడిపశువుల కొనుగోలుకు లబ్ధిదారులు సిద్ధం

ధర రూ.75 వేలు దాటితే అదనపు మొత్తం లబ్ధిదారులే భరించాలి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల్లోని మహిళా లబ్ధిదారులు పాడిపశువులను రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లోగానీ కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాడిపశువుల కొనుగోలుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య విడుదల చేశారు. 45 నుంచి 60 సంవత్సరాల్లోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళలకు వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలు అందజేసినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారుల ఆదాయం పెంపు, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పాల ఉత్పత్తి పెరుగుదలకు ఆర్‌బీకేల్లో మేలిరకం పశువుల మేత,  దాణా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. దాదాపు 5.63 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెల కొనుగోలుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు..

► ముర్రా జాతి గేదెలు, జెర్సీ, హెచ్‌ఎఫ్‌ సంకరజాతి అవులు, గిరి, సహావాల్‌ దేశీయరకం ఆవులను పాడివైనా, చూడివైనా కొనుక్కోవచ్చు. 
► ఇనాఫ్‌ ట్యాగ్‌ ఉన్న వాటినే సెర్ప్, పశుసంవర్ధకశాఖల సిబ్బంది పర్యవేక్షణలో రాష్ట్రంలోగానీ, ఇతర రాష్ట్రాల్లోగానీ కొనుగోలు చేసుకోవచ్చు.
► పాల దిగుబడి, పశువు వయసు, లక్షణాలను బట్టి ధర నిర్ణయించాలి. 
► అమ్మకందారులు తమకు సమీపంలోని ఆర్‌బీకేల వద్దకుగానీ, పశువిక్రయ కేంద్రాలకుగానీ పశువులను తరలించాలి.
► పశుసంవర్ధకశాఖ వైద్యులు పరిశీలించి వ్యాధులు లేవని నిర్ధారించిన తరువాత లబ్ధిదారులు కొనుగోలు చేయాలి.
► మేలిరకం జాతి ఎంపిక, కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లబ్ధిదారులకు శిక్షణ ఇస్తారు.  
► పశువుల రవాణా, బీమా తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.
► పశువుల ధర రూ.75 వేలకు మించితే అదనపు మొత్తాన్ని లబ్ధిదారులే భరించాలి.
► పశువుల రవాణా ఖర్చులను ముందు లబ్ధిదారులు భరించాలి. వాటి రశీదులను బ్యాంకర్లకు ఇచ్చి ఆ ఖర్చులు పొందవచ్చు.  

మరిన్ని వార్తలు