విపత్తులోనూ ఉవ్వెత్తున..

31 Mar, 2021 03:37 IST|Sakshi
గత ఐదేళ్లలో ఉపాధి కూలీలకు చెల్లించిన వేతనాలు.. (రూ.కోట్లలో)

రికార్డుస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్లు దాటిన ‘ఉపాధి’

ఒకే ఏడాదిలో 25.42 కోట్ల మేర పనిదినాల కల్పన కూడా తొలిసారే

పేదలకు పనులు కల్పిస్తూనే గ్రామాల్లో భారీగా ఆస్తుల కల్పన

సాక్షి, అమరావతి: కరోనా విపత్తుతో అల్లాడిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలులో అద్భుత ప్రగతి కనబరిచింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మార్చి 29వ తేదీ సోమవారం నాటికి రూ.10,169.65 కోట్ల దాకా ఇందుకు ఖర్చుపెట్టింది. ఒకపక్క పని అడిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఈ పథకం ద్వారా పనులు కల్పిస్తూనే, గ్రామాల్లో ఏకంగా 48,966 శాశ్వత భవన నిర్మాణ పనుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47.70 లక్షల కుటుంబాలకు 25.42 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించి కూలీ నిమిత్తం వారికి ఏకంగా రూ.5,818 కోట్లు చెల్లించింది. భవన నిర్మాణ పనులకు మరో 3,965.41 కోట్లు ఖర్చుచేసింది. మరో రూ.386 కోట్లకు పైగా పథకం అమలు నిర్వహణకు ఖర్చుచేశారు. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద సంఖ్యలో పేదల కుటుంబాలకు పనులు కల్పించడంలోగానీ.. ఒకే ఏడాది రూ.25 కోట్లకు పైబడి పనిదినాల పాటు పనులు కల్పించడంలోగానీ.. కూలీలకు ఉపాధి కల్పిస్తూ గ్రామాల్లో వేల సంఖ్యలో శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడంలోగాని రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. 

అత్యధిక లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే
కరోనా విపత్తులో రూ.5,818 కోట్ల మేర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చితే, అందులో 83 శాతానికి పైబడి ఎస్సీ, ఎస్టీ, బీసీలే లబ్ధిపొందారు. అందులోనూ బీసీ సామాజిక వర్గాల వారు 48.64 శాతం మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు అధికారులు తెలిపారు. అలాగే.. 

► గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు లాక్‌డౌన్‌ కారణంగా గ్రామాలకు తిరిగిరావడంతో, అలాంటి వారి కుటుంబాలకు 3.85 లక్షల కొత్త జాబ్‌కార్డులు మంజూరు చేశారు. దీంతో మొత్తంగా ఈ ఏడాది 8.79 లక్షల మంది కొత్తగా ఉపాధి కూలీలుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 

► దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్న జూన్‌ 9వ తేదీ ఒక్కరోజునే రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది ‘ఉపాధి హామీ’ ద్వారా పనులు పొందారు. ఇదో రికార్డుగా అధికారులు చెబుతున్నారు. 

► ఆ నెలలో ఒక్క విజయనగరం జిల్లాలోనే పేదలకు కోటి పనిదినాల మేర పనులు కల్పించారు. మరో ఐదు జిల్లాల్లో 50 లక్షలకు పైబడి పనిదినాల పాటు పేదలు ‘ఉపాధి’ పొందారు. 

► దీంతో ఈ ఏడాది కూలీలు సరాసరి రూ.228 చొప్పున వేతనం పొందారు.

13,054 భవన నిర్మాణాలు పూర్తి
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వరకు సొంత పంచాయతీ కార్యాలయ భవనం కూడా లేని చిన్నచిన్న గ్రామాల్లో సైతం ఇప్పుడు గ్రామ సచివాలయ భవనం, రైతుభరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌ భవనాలతో పాటు అంగన్‌వాడీ, పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దస్థాయిలో శ్రీకారం చుట్టింది.

పేదలకు ‘ఉపాధి’ కల్పిస్తూనే ఈ పథకం నిధులను ఇతర ప్రభుత్వ నిధులతో అనుసంధానంచేసి గ్రామాల్లో శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,966 శాశ్వత భవనాలను ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నిర్మిస్తోంది. వీటిలో 13,054 భవనాలు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.

‘ఉపాధి’లో పచ్చదనానికి పెద్దపీట
ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత సాధించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చింది. 37,870 మంది రైతులకు చెందిన 56,675 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధితో పాటు 10,706 కి.మీ. పొడవునా రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టింది. 11,928 హౌసింగ్‌ లే అవుట్‌లలో, ప్రభుత్వ పాఠశాలల్లో, రైల్వేకు చెందిన 34 ప్రాంతాల్లో మొక్కల పెంపకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించింది. 

ఈ ఏడాది ‘ఉపాధి’ అమలు ఇలా..
► రాష్ట్రంలో యాక్టివ్‌ ‘ఉపాధి’ జాబ్‌కార్డులు: 55.52 లక్షల కుటుంబాలకు
► వీటిలో నమోదైన కూలీల సంఖ్య: 96.16 లక్షల మంది
► 2020–21లో పనులు పొందిన కుటుంబాలు: 47,70,602
► పనిచేసిన కూలీల సంఖ్య: 79,75,413 
► పని కల్పించిన మొత్తం పనిదినాలు: 25,42,07,719
► ఏడాదిలో కూలీలకు వేతనాలుగా చెల్లించింది: రూ.5,818.07 కోట్లు
► ఇందులో ఎస్సీలకు కల్పించిన పని: 5,76,48,132 (22.68%) పనిదినాలు
► ఎస్టీలకు కల్పించిన పని: 2,82,87,014 (11.13 శాతం) పనిదినాలు
► బీసీలకు కల్పించిన పని: 12,36,37,848 (48.64 శాతం) పనిదినాలు
► మైనార్టీలకు కల్పించిన పని: 31,35,242 (1.23 శాతం) పనిదినాలు
► ఇతరులకు కల్పించిన పని: 4,22,47,495 (16.62 శాతం) పనిదినాలు

సమిష్టి కృషితోనే.. 
రాష్ట్రంలో ఉపాధి హామీ ద్వారా రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థ నాయకత్వం, అధికార యంత్రాంగం సమిష్టి కృషి ఉంది. మరో రెండ్రోజుల్లో (మార్చి 31 నాటికి) 26 కోట్ల పనిదినాల మైలురాయిని కూడా అధిగమిస్తాం. ఈ రాష్ట్రంలో పనుల్లేక ఇతర ప్రాంతాలకు ఏ ఒక్కరూ వలస వెళ్లే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతోనే సీఎం జగన్‌ నిత్యం పనిచేస్తున్నారు. అధికారులు ఇదే స్ఫూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మరింత ప్రగతి కనబర్చేలా పనిచేయాలి.  
 – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి   

మరిన్ని వార్తలు