టీకా టైమ్

11 Jan, 2021 03:21 IST|Sakshi

వ్యాక్సినేషన్‌కు యంత్రాంగాన్ని సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

మండలం నుంచి జిల్లా స్థాయి వరకూ పర్యవేక్షణాధికారులు 

శీతలీకరణ ప్రక్రియ పూర్తి.. వ్యాక్సిన్‌ నిల్వకూ అంతా రెడీ 

వ్యాక్సిన్‌ వేయించుకునే వారు ఆధార్‌ కార్డు తీసుకురావాలి 

వ్యాక్సినేషన్‌తో పల్స్‌ పోలియో వాయిదా 

సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తిగా సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మండల స్థాయి నుంచి మున్సిపాలిటీ వరకూ ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను వేసి పర్యవేక్షణను ముమ్మరం చేశారు. ఈనెల 16న వ్యాక్సిన్‌ను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుండటం.. ఈలోగా ఏ క్షణమైనా రాష్ట్రానికి వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి అన్ని స్థాయిల్లో యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంచేసింది. వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు అవసరమైన శీతలీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. మరోవైపు.. ఈ నెల 17న జరగాల్సిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని కరోనా వ్యాక్సినేషన్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. త్వరలోనే ఈ తేదీలను వెల్లడిస్తామని ప్రకటించింది. 
 
తొలిదశలో వీరికే వ్యాక్సిన్‌.. 
– తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే 3.70 లక్షల మంది హెల్త్‌కేర్, అంగన్‌వాడీ వర్కర్లు ఉన్నారు. వీరి పేర్లు ఇప్పటికే కో–విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. 
– ఆ తర్వాత పోలీసు విభాగం, ఆర్మ్‌డ్‌ ఫోర్స్, హోంగార్డ్, జైళ్ల సిబ్బంది, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, వలంటీరు, సివిల్‌ డిఫెన్స్, మున్సిపల్, వర్కర్లు మొత్తం 9 లక్షల మంది ఉన్నారు. 
– వీరితోపాటు 50 ఏళ్ల వయసు దాటిన వారు, 50 ఏళ్ల వయసు దాటి మధుమేహం, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు 90 లక్షల మంది ఉన్నారు.  
– ఇలా మొత్తం కోటిమందికి పైగా తొలిదశలో టీకా వేస్తారు 
 
వ్యాక్సినేషన్‌ ఆఫీసర్లు వీరే.. 
– వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌–1 : పోలీసు/హోంగార్డు/ఎన్‌సీసీ తదితరులు 
– వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌–2 : డిజిటల్‌ అసిస్టెంట్‌/వలంటీర్లు 
– వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌–3, 4 : అంగన్‌వాడీ వర్కర్‌/ఆశా వర్కర్‌ తదితరులుంటారు. జనం ఎక్కువమంది గుమికూడకముందే వేగంగా నమోదు చేస్తారు 
– వ్యాక్సినేటర్‌ ఆఫీసర్‌ : ఏఎన్‌ఎం/డాక్టర్‌/ఫార్మసిస్ట్‌/జీఎన్‌ఎం తదితరులు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఎక్కడైనా దుష్ఫలితాలు కలిగితే వారికి వెంటనే వైద్యం చేయడం, లేదా ఆస్పత్రికి తరలించడం చేస్తారు 
వీరంతా ఎక్కడికక్కడ నిర్ణయించిన రోజున, నిర్దేశిత ప్రదేశంలో సూచించిన సమయానికి విధిగా ఉంటారు. ఈ కార్యక్రమాన్ని మండలాల వారీగా తహశీల్దార్లు, జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌ఓలు, ఆ పైన కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. 
 
ఆధార్‌ తప్పనిసరి.. 

ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్‌ వేయించుకునే ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. వ్యాక్సినేషన్‌ అయిపోయిన అనంతరం వీరి వివరాలు కో–విన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేస్తారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు