రైతులకు రూ.135.70కోట్ల పెట్టుబడి రాయితీ

27 Oct, 2020 02:30 IST|Sakshi

బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశం

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న అన్నదాతలకు ఊరట

ఉద్యాన పంటలకూ వర్తింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుది అంచనాలు పూర్తి చేసిన ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్‌) నిబంధనావళి ప్రకారం 33 శాతానికి మించి వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిన రైతులకు  రూ.113,11,68,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.22,58,84,000 మేర పెట్టుబడి రాయితీని విడుదల చేసింది.  

ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాలకు జమ 
జూన్, జూలైలో వర్షాల వల్ల ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 14,005 మంది రైతులకు చెందిన 8,443.75 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ కమిషనర్‌ ప్రతిపాదన మేరకు పెట్టుబడి రాయితీగా ప్రభుత్వం రూ.12.39 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు, సెపె్టంబర్‌లో వరదలు, భారీ వర్షాలవల్ల 1,28,889 మంది రైతులకు చెందిన 73,664.73 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వీరికి రూ.100.72 కోట్లు పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర సమాచారాన్ని పక్కాగా పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వారి ఖాతాలకు ఆన్‌లైన్‌లో జమ చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.  

ఉద్యాన రైతులకు రూ.22.58 కోట్లు...  
ప్రకాశం, ఉభయ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు  ప్రభుత్వం రూ. 22.58 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం వేర్వేరు జీవోలు 
జారీ చేశారు.

సాయంలో శరవేగం.. 
రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. విపత్తు వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా అతి తక్కువ సమయంలోనే పెట్టుబడి రాయితీని అందిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపత్తు బాధిత రైతులకు రూ.1,800 కోట్ల పెట్టుబడి రాయితీని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ బకాయిలను విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కూడా వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన సాయం అందించింది. ఈ ఏడాది సెపె్టంబర్‌ వరకు రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ఈ నెలలో భారీ వరదల వల్ల జరిగిన పంట నష్టం అంచనాలను పూర్తి చేసి నవంబర్‌లో బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ అందించేలా  చర్యలు చేపట్టింది. 

మరిన్ని వార్తలు