సమర్థంగా కోవిడ్‌ కట్టడి

1 Oct, 2020 04:13 IST|Sakshi

రాష్ట్రంలో సగటున ఒకరి నుంచి 0.94 మందికే వైరస్‌ వ్యాప్తి

ప్రభుత్వం ఎక్కువ మందికి టెస్టులు చేయడం వల్లే నియంత్రణ  

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమైంది. భారీ సంఖ్యలో పరీక్షలు చేయడం, పాజిటివ్‌ వ్యక్తులను ఆస్పత్రుల్లో చేర్చడం లేదా హోం ఐసోలేషన్‌లో ఉంచడం వల్ల కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. రాష్ట్రంలో ఒక పాజిటివ్‌ వ్యక్తి నుంచి వేరొకరికి వైరస్‌ వ్యాపించే సగటు.. ఒకటి కంటే తక్కువ ఉండటం శుభపరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 3 జిల్లాలు మినహా మిగతా 10 జిల్లాల్లో ఈ సగటు ఒకటి కంటే తక్కువగా ఉంది. సాధారణంగా ఒక పాజిటివ్‌ వ్యక్తి ద్వారా 8 నుంచి 60 మందికి వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంది. టెస్టులు ఎక్కువగా చేయడం, పాజిటివ్‌ వ్యక్తుల్ని త్వరగా గుర్తించడం వల్లే వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఆగస్టు 30 నాటికే సీరో సర్వైలెన్స్‌ 20 శాతం పైనే ఉన్నట్టు తేలింది. ఇప్పుడా సంఖ్య పెరిగి ఉంటుందని, కోటిన్నర మందికి పైగా కరోనా సోకి కోలుకుని ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1.50 కోట్ల నుంచి 2 కోట్ల మధ్య జనం స్వల్పంగానో, మధ్యస్థంగానో వైరస్‌ బారిన పడి, తమకు తెలియకుండానే కోలుకుని ఉండవచ్చునని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇది మరింత పెరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పాజిటివ్‌ కేసులు, మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుండటం శుభపరిణామమని అంటున్నారు.

చాలా మందికి వచ్చినట్లు కూడా తెలియదు
కరోనా వైరస్‌ సోకి కోలుకున్న వారి సంఖ్య కోటిన్నర దాటి ఉంటుంది. ఎక్కువగా మైల్డ్‌ (తీవ్రత లేని)కేసులే కాబట్టి చాలామందికి వచ్చినట్టు కూడా తెలియదు.ఈ సంఖ్య 2 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాను రాను తీవ్రత తగ్గుతూ ఉంది. టెస్టులు ఎక్కువ చేయడం వల్ల కరోనాని నియంత్రించగలిగాం.
–డా.రాంబాబు, నోడల్‌ అధికారి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 

మరిన్ని వార్తలు