సమ్మర్‌ స్టడీస్‌.. ఇంట్లోనే చదవండి ఇలా!

29 May, 2022 15:30 IST|Sakshi
యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న చిన్నారులు

తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో పదాలు, కథలు 

సెల్‌ రీడింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్న చిన్నారులు 

సాక్షి,బలిజిపేట(పార్వతిపురం మ‍న్యం): వేసవి సెలవుల్లో కూడా విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం, నేర్చుకునే తత్వం పెంచేవిధంగా ఏపీ విద్యాశాఖ కొత్త తరహాలో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పాఠశాలల్లో అమలవుతున్న ‘ఉయ్‌ లవ్‌ రీడింగ్‌’ సెలవుల్లో కొనసాగించేలా సమగ్ర శిక్ష అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా గూగుల్‌ సంస్థతో ఏపీ సమగ్ర శిక్ష అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్‌ సంస్థ ఎడ్యుకేషన్‌ విభాగంలో ప్రవేశపెట్టిన ‘గూగుల్‌ రీడ్‌ అలాంగ్‌’ యాప్‌ను ఏపీ విద్యార్థులు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. స్మార్ట్‌ఫోన్లు ఉన్న తల్లిదండ్రులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు ఇస్తే వారు చదువుకునే అవకాశం ఉంది. 

తెలుగు, ఇంగ్లిష్‌పై పట్టు.. 
వినోదాత్మక ప్రసంగ ఆధారిత రీడింగ్‌ యాప్‌లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉపయోగపడే విధంగా పదాలు, కథలు, ఆటలు రూపొందించారు. వీటిని రోజూ చదివితే ఆయా భాషల్లో పఠనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఆసక్తి కలిగిన కథనాలను చదవమని, ‘దియా’ పేరుతో ఉన్న యానిమేషన్‌ బొమ్మ విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఈ యాప్‌లో స్వరాన్ని గుర్తించే సదుపాయం ఉంది. పిల్లలు పదాలు, కథలు చదివినప్పుడు తప్పులు దొర్లితే యాప్‌ ద్వారా గుర్తించబడి తప్పులు సవరించే సదుపాయం ఉంది. దీనిని ఒకసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు నెట్‌ అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది. దీనిలో ఎటువంటి ప్రకటనలు ఉండవు. పుస్తకాలు, పిల్లల కథలు, చోటా భీమ్‌ నుంచి వివిధ పఠన స్థాయిలో వెయ్యికి పైగా పుస్తకాలతో లైబ్రరీ ఉంటుంది.  విద్యార్థులు  యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మంచి కథలు నేర్చుకుంటున్నారు. 

పఠనా సామర్థ్యం పెరుగుతుంది.. 
యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా మంచి పాఠాలు, భాష నేర్చుకోవచ్చు. తద్వారా పఠనా సామర్థ్యం పెరుగుతుంది. వేసవిలో విద్యార్థులకు మంచి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.   
– శ్రీనివాసరావు, ఎంఈఓ, బలిజిపేట

మరిన్ని వార్తలు