పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆనందోత్సాహాలు

9 Aug, 2021 15:06 IST|Sakshi
బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం సమీపంలో సిద్ధమైన పునరావాస గృహ నిర్మాణాలు

పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.550 కోట్ల చెల్లింపు

బుట్టాయగూడెం/ పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచడంతో నిర్వాసిత గ్రామాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నిర్వాసితులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారమవడంతో సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారాన్ని రూ.10 లక్షలు చెల్లిస్తామని గతంలో సీఎం హామీఇచ్చారు. అన్నట్లుగానే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ జూలై రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.

ఆ పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశంలో రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అదనపు చెల్లింపుల నేపథ్యంలో ప్రభుత్వంపై రూ. 550 కోట్ల అదనపు భారం పడనుంది. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. నిర్వాసితుల సమస్య పరిష్కారం కూడా ముఖ్యమని భావించిన సీఎం జగన్‌ ఈ భారాన్ని లెక్కచెయ్యకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. 

10,429 కుటుంబాలు తరలించేందుకు ఏర్పాట్లు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 44 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆ గ్రామాల ప్రజల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో 44 గ్రామాల తరలింపునకు మార్గం సుగమమైంది. పోలవరం మండలంలో 19 గ్రామాల్లో 3,311 కుటుంబాలు, కుక్కునూరు మండలంలో 8 గ్రామాల్లో 3,024 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 17 గ్రామాల్లో 4,094 కుటుంబాలు మొత్తం 10,429 కుటుంబాలను తరలించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 41.15 కాంటూరు పరిధిలో నిర్వాసితులను తరలించేందుకు నిర్మిస్తున్న పునరావాస గృహ నిర్మాణాలు ఇప్పటికే అన్ని సౌకర్యాలతో సిద్ధమయ్యాయి. 

ఆయన చెప్పాడంటే చేస్తాడు..
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒక మాటిస్తే ఆ మాట నెరవేరుస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను రెండేళ్లలో 99 శాతం పూర్తి చేశారు. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితుల సమస్యలు కూడా అంతే ముఖ్యమని సీఎం జగన్‌ భావిస్తున్నారు. అందుకే నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. 
– తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే

సీఎంకు రుణపడి ఉంటాం
ఇచ్చిన మాట ప్రకారం మాకు పరిహారం రూ.10 లక్షలకు పెంచినందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. రూ.10 లక్షలు చెల్లించేందుకు జీఓ ఇవ్వడమే కాకుండా కేబినెట్‌ ఆమోదం తెలపడంతో మాకు మరింత నమ్మకం ఏర్పడింది. రూ. 7,11,000 ఇప్పటికే మా బ్యాంక్‌ ఖాతాలో జమైంది. మిగిలిన సొమ్ము త్వరలో అందుతుందని చెప్పారు.
– జి.అనిల్‌ కుమార్, నిర్వాసితుడు, కోండ్రుకోట, పోలవరం మండలం

చాలా సంతోషంగా ఉంది
మాకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ. 10 లక్షలు ఇస్తారని ఊహించలేదు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో మా బాధ చెప్పుకున్నాం. రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత సొమ్ము పరిహారంగా వస్తుందని ఊహించలేదు. 
– ఎం. బొత్తయ్య, నిర్వాసితుడు, మాదాపురం, పోలవరం మండలం 

మరిన్ని వార్తలు