AP: పీఆర్సీ ఐదేళ్లకే.. జీవో జారీ..

12 May, 2022 08:30 IST|Sakshi

వేతన సవరణ సంఘం అమలుపై జీవోలు జారీ చేసిన ప్రభుత్వం

రిటైర్మెంట్‌ సమయంలో పీఆర్సీ బకాయిలు

ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్స్‌ ఇస్తూ ఉత్తర్వులు

అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలకు పెంపు

ఐఆర్‌ రికవరీ లేదని మరో జీవో జారీ

ట్రావెలింగ్‌ అలవెన్స్‌ పెంపు

త్వరలో మరికొన్ని జీవోలు ఇస్తామని అధికారులు వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీ అమలు ఉత్తర్వుల్లో పలు సవరణలకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐదేళ్లకోసారి పీఆర్సీ ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: సచివాలయ ఉద్యోగులకు జూన్‌కల్లా ప్రొబేషన్‌ డిక్లేర్‌ 

పీఆర్సీ బకాయిలను రిటైర్‌మెంట్‌ సమయంలో ఇచ్చేందుకు ఒక జీవో జారీ చేసింది. పెండింగ్‌లోని ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లను ఇచ్చేలా జీవో ఇచ్చింది. ఐఆర్‌ రికవరీ చేయకుండా మరో ఉత్తర్వును జారీ చేసింది. ఉద్యోగుల ట్రావెలింగ్‌ అలవెన్స్‌ పెంపు, అంత్యక్రియలకు రూ. 25 వేలు ఇచ్చేలా వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఇలా మొత్తం ఆరు అంశాలపై 8 జీవోలను ఇచ్చింది.

ఉద్యోగుల ప్రతినిధులకు జీవో ప్రతులు
బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో జీవోల ప్రతులను వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అధికారులు అందజేశారు. పీఆర్సీ అమలుకు సంబంధించిన ఈ సమావేశం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్‌) హెచ్‌.అరుణ్‌కుమార్‌ల సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో ఎస్‌.ఎస్‌.రావత్‌ మాట్లాడుతూ పీఆర్సీ  పెండింగ్‌ అంశాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.పెండింగ్‌ బిల్లులను కూడా ప్రాధాన్యత క్రమంలో చెల్లించనున్నట్లు తెలిపారు.

శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ పీఆర్సీ అమలుకు సంబంధించి మరో రెండు జీవోలను కూడా బుధవారం రాత్రి లేదా గురువారం విడుదల చేయనున్నట్లు చెప్పారు. మరికొన్ని జీవోలు త్వరలో విడుదలవుతాయన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఆయా సంఘాల జనరల్‌ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు