సినిమా టికెట్ల ధరలపై జీవో విడుదల

8 Mar, 2022 09:15 IST|Sakshi

సామాన్యులకు రేట్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు 

రోజులో ఒక షో చిన్న బడ్జెట్‌ సినిమాకు కేటాయించాలి 

ఏసీ, నాన్‌ ఏసీ థియేటర్లలో నాన్‌ ప్రీమియం కేటగిరీ  

నాన్‌ ప్రీమియం కేటగిరీలో 25 శాతం సీట్లు తప్పనిసరి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం సవరించింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, అదే సమయంలో సామాన్యులకు టికెట్ల ధర అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ఇతర వర్గాలతో ప్రభుత్వం పలు దఫాలుగా సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. టికెట్ల అంశాన్ని పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ల ధరలను ఖరారు చేసింది. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు/పంచాయతీల వారీగా సినిమా థియేటర్లను 4 కేటగిరీలుగా విభజించి టికెట్ల ధరలను నిర్ణయించింది. సినిమా టికెట్ల కనిష్ట ధర రూ. 20గా, గరిష్ట ధర రూ. 150గా నిర్ణయిస్తూ రిక్లయినర్‌ సీట్లకు టికెట్‌ను రూ. 250గా ఖరారు చేసింది. నిర్వహణ చార్జీలతో కలుపుకొని ఆ టికెట్‌ ధరలను ప్రకటించింది. కాగా దీనికి జీఎస్టీ అదనమని పేర్కొంది. 

పేదలకు అందుబాటులో సినిమా...
పేదలకు సినిమా అందుబాటులో ఉండేందుకు నాన్‌ ప్రీమియం కేటగిరీని ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఏసీ, నాన్‌ ఏసీ థియేటర్లు తప్పనిసరిగా 25 శాతం సీట్లను నాన్‌ ప్రీమియం కేటగిరీ కింద కేటాయించాలని స్పష్టం చేసింది. తక్కువ బడ్జెట్‌ సినిమాలకు ప్రోత్సాహంపై విధాన నిర్ణయం ప్రకటించింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. కాగా పండుగ రోజులతో సహా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఒక షోను తప్పనిసరిగా చిన్న బడ్జెట్‌ సినిమాల ప్రదర్శనకు కేటాయించాలని షరతు విధించింది. నటీనటుల పారితోషికం సహా బడ్జెట్‌ రూ. 20 కోట్లు లోపు ఉన్నవాటిని చిన్న సినిమాగా గుర్తిస్తామని పేర్కొంది. 

రూ. 100 కోట్లు నిర్మాణ వ్యయం దాటితే..
హీరో, హీరోయిన్, దర్శకుల పారితోషికాలు మినహా రూ. 100 కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలు విడుదల తేదీ నుంచి పదిరోజుల పాటు టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదీ ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 20 శాతం షూటింగ్‌ చేసిన సినిమాలకే ఈ వెసులుబాటు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 
► తక్కువ బడ్జెట్, సూపర్‌హై బడ్జెట్‌ సినిమాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేస్తామని పేర్కొంది.
► ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయ విధానాన్ని అమలు చేస్తామని పేర్కొంది.
► జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకుంటారని వెల్లడించింది. 

చదవండి: కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు