మరో రెండింటిని ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలి

1 Mar, 2021 04:42 IST|Sakshi

జమ్మలమడుగు–నంద్యాల, కొడికొండ చెక్‌పోస్టు–ముద్దనూరు–కదిరి రోడ్లకు ప్రతిపాదనలు  

కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడు స్టేట్‌ హైవేలను నేషనల్‌ హైవేస్‌గా మార్చేందుకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలపడంతో మరో రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ హైవేస్‌కు లేఖ రాసింది. రాయలసీమ జిల్లాల్లో వైఎస్సార్‌ కడప, కర్నూలు, అనంతపురంలలో రెండు రహదారులపై ట్రాఫిక్‌ పెరిగినందున ఎన్‌హెచ్‌లుగా గుర్తింపు ఇవ్వాలని లేఖలో కోరింది. జమ్మలమడుగు–నంద్యాల, కొడికొండ చెక్‌పోస్టు–ముద్దనూరు–కదిరి రాష్ట్ర రహదారులను ఎన్‌హెచ్‌లుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. ఈ రహదారులపై నిత్యం ఏడు వేల ప్యాసింజర్‌ కార్‌ యూనిట్లు (పీసీయూ) వెళ్తున్నందున ట్రాఫిక్‌ పెరిగిందని రహదారుల అభివృద్ధి సంస్థ నివేదించింది.  

గెజిట్‌ నోటిఫికేషన్‌ 
ఇప్పటికే మూడు రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారుల నంబర్లను కేటాయించి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ, ఏపీలను కలిపే విధంగా మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల మధ్య ఎన్‌హెచ్‌–67 జంక్షన్‌ వద్ద నాగర్‌కర్నూల్, కోలాపూర్, రామాపూర్, మండుగల, శివాపురం, కరివెన, నంద్యాల వరకు (ఎన్‌హెచ్‌–40 సమీపంలో) ఉన్న 94 కి.మీ. రోడ్డును ‘ఎన్‌హెచ్‌–167కే’గా గుర్తించింది. అనంతపురం జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్‌–44పై కోడూరు నుంచి ముదిగుబ్బ (ఎన్‌హెచ్‌–42) వయా పుట్టపర్తి మీదుగా వెళ్లే 79 కి.మీ. రాష్ట్ర రహదారికి ఎన్‌హెచ్‌–342 కేటాయించారు. వైఎస్సార్‌ కడప జిల్లా పరిధిలోనూ రాయచోటి–వేంపల్లె–యర్రగుంట్ల–ప్రొద్దుటూరు–చాగలమర్రి వరకు ఉన్న 130.50 కి.మీ. రోడ్డును తాజాగా ఎన్‌హెచ్‌గా గుర్తించారు. ఈ రోడ్డుకు ఎన్‌హెచ్‌–440 నంబర్‌ కేటాయించారు.   

మరిన్ని వార్తలు