అధైర్యం వద్దు.. మీకూ స్థలం వస్తుంది

29 Mar, 2021 03:07 IST|Sakshi

3.77 లక్షల మందికి సర్కార్‌ లేఖలు 

న్యాయ వివాదాలు తేలగానే మిగిలిన పేదలకూ పట్టాల పంపిణీ  

తెలుగుదేశం కేసుల వల్లే ఈ స్థలాలు పెండింగ్‌

కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేయాలని సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్త స్థాయిలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృఢ సంకల్పానికి గండి కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న టీడీపీ నేతలు తాత్కాలికంగా 3.77 లక్షల మందికిపైగా పేదల గూడుకు అడ్డంకులు సృష్టించారు. న్యాయస్థానాలను ఆశ్రయించి 3,77,403 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా అడ్డుకున్నారు. అయితే న్యాయ వివాదాల కారణంగా పేదలు అధైర్య పడకుండా భరోసా కల్పించేందుకు వారికి ఇళ్ల స్థలం మంజూరైందని, కేసులు తేలగానే ఇళ్ల స్థలాల పట్టాలిస్తామని పేర్కొంటూ అధికారులు లేఖలు పంపారు. న్యాయస్థానాల్లో కేసులున్న లబ్ధిదారులందరికీ సీఎం ఆదేశాల మేరకు లేఖల పంపిణీ పూర్తి చేశారు. 

ఇంత భారీగా ఇదే తొలిసారి..
ఇప్పటివరకు దేశ చరిత్రలోగానీ రాష్ట్ర చరిత్రలోగానీ పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇంత పెద్దఎత్తున సేకరించిన దాఖలాలు లేవు. తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్‌ ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలను సంతృప్త స్థాయిలో అందచేసేందుకు ఏకంగా 68 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించి పంపిణీ చేయించారు. సుమారు 30.66 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

టీడీపీ నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తేవడంతో 3.77 లక్షల మంది పేదలకు మాత్రం ఇళ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే దీన్ని శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరింపచేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల పంపిణీ ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారులు ఆందోళన చెందకుండా అధికారులు లేఖలు పంపారు. దురుద్దేశపూర్వకంగా దాఖలైన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు

మరిన్ని వార్తలు