‘కరోనా’ అనాథ బాలలకు రూ.10 లక్షలు

27 May, 2021 04:34 IST|Sakshi

కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు సీఎం ప్రకటించిన సాయం పంపిణీ

కాకినాడ సిటీ: కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించిన చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ప్రారంభమైంది. కోలమూరుకు చెందిన పెరువల్లి హెరిన్‌ (7), శశి (2)లకు, కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన శరణ్య (11)కు రూ.10 లక్షల వంతున డిపాజిట్‌ చేసిన బాండ్లను బుధవారం కాకినాడలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అందించారు. కోవిడ్‌ విపత్తు కారణంగా అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

వారం రోజులు దాటకముందే జిల్లాలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులను గుర్తించారు. కరోనాతో చికిత్స పొందుతూ కోలమూరుకు చెందిన పెయింటర్‌ పెరువల్లి రాజేష్‌ ఈనెల 15న, అతడి భార్య రాణి ఈనెల 17న మృతిచెందారు. వీరి కుమారులు హెరిన్, శశి అనాథలయ్యారు. ప్రస్తుతం ఈ చిన్నారుల్ని గోకవరానికి చెందిన చిన్నాన్న, పిన్ని పెరువల్లి కుమార్‌బాబు, మేరి అక్కున చేర్చుకున్నారు. తిమ్మాపురంలో లారీ డ్రైవర్‌ వడ్డి బాబ్జీ, అతడి భార్య కుమారిలకు కరోనా సోకింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న బాబ్జీ, మూడురోజుల తర్వాత కుమారి కన్నుమూశారు. దీంతో వీరి కుమార్తె శరణ్యను తాతయ్య, నాయనమ్మ చేరదీశారు. ఈ ముగ్గురు పిల్లల పేరుతో రూ.10 లక్షల వంతున ప్రభుత్వం బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. సంరక్షకులకు ఈ బాండ్లను కలెక్టర్‌ అందజేశారు.  

మరిన్ని వార్తలు