AP: పేదల ఇళ్లు చల్లగా.. నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికత

29 Nov, 2021 11:29 IST|Sakshi

ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లలో ‘ఎకో–నివాస్‌ సంహిత’ 

‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణాల్లో ప్రపంచ శ్రేణి సాంకేతికత 

ఇళ్లలో కనీసం 2 డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రతలు 

విద్యుత్‌ బిల్లుల్లో 20 శాతం ఆదా అయ్యే అవకాశం

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికతను వినియోగించడం ద్వారా గాలి, వెలుతురు బాగా వచ్చేలా.. ఇళ్లలో శీతలీకరణ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్‌ బిల్లులను ఆదా చేసే ఈ సాంకేతికతను ‘ఎకో–నివాస్‌ సంహిత’ పేరిట అమలు చేయాలని నిర్ణయించింది. గృహ నిర్మాణ శాఖ ద్వారా చేపడుతున్న 28.3 లక్షల ఇళ్లలో బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో లబ్ధిదారుల అంగీకారంతో దీనిని అమలు చేస్తారు. ఇంధన సామర్థ్య బిల్డింగ్‌ డిజైన్‌ల ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించే విధంగా ఇళ్ల నిర్మాణాలు జరుపుతారు.

ప్రజాహితం.. పర్యావరణ పరిరక్షణ 
దేశంలో మొత్తం విద్యుత్‌ వినియోగంలో భవనాల వాటా 38 శాతం కాగా.. 20 ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఈ రంగంలో విద్యుత్‌ వినియోగం మూడు రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరగనుంది. ఎకో నివాస్‌ పథకం ద్వారా ప్రపంచ శ్రేణి ‘ఇండో స్విస్‌ ఎనర్జీ ఎఫిషియంట్‌ బిల్డింగ్‌ టెక్నాలజీ’ని అమలు చేస్తారు. దీనివల్ల శీతలీకరణ జరిగి ఇళ్లలో ఉష్ణోగ్రతలు కనీసం 2 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఈ టెక్నాలజీ వల్ల సహజ వెలుతురు పెరగడంతో పాటు 20 శాతం విద్యుత్‌ బిల్లులు కూడా ఆదా అవుతాయి. గ్రీన్‌హౌస్‌ వాయువులు (కర్బన ఉద్గారాలు) కూడా తగ్గుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను అరికట్టడానికి, ఇంధన పొదుపు చేయడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లోనూ.. 
వెయ్యి చదరపు మీటర్ల ప్లాట్‌ లేదా 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల కమర్షియల్, నాన్‌ రెసిడెన్షియల్‌ భవనాల నిర్మాణ అనుమతులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఏపీ ఈసీబీసీ)ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలోనూ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మొదటి దశలో రూ.28 వేల కోట్ల అంచనా వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే 10,055 లేఅవుట్లలో 10.7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటన్నిటితో పాటు మొత్తం 28.3 లక్షల ఇళ్లలోనూ ఈసీబీసీని అమలు చేయనుంది. 

‘ఎకో–నివాస్‌’ ఇలా.. 
పగటిపూట సహజ సిద్ధ వెలుతురు (సూర్యరశ్మి) ఇంటిలోకి వచ్చే విధంగా డిజైన్‌ ఉంటుంది.  
రేడియంట్‌ కూలింగ్‌ విధానం ద్వారా ఇంట్లో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేలా సీలింగ్, గోడలకు ప్రత్యేక ఫోమ్‌ని, పెయింట్స్‌ వినియోగిస్తారు.  
ఫ్లోర్‌పైనా ఇంటిని చల్లబరిచే ప్రత్యేక టైల్స్‌ అమర్చుతారు. హార్డ్‌ ఉడ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. 
కిటికీలకు అమర్చే అద్దాలు కూడా ప్రత్యేకంగా రూపొందించినవే ఉంటాయి. 
అత్యంత మన్నిక కలిగిన ఇన్సులేటెడ్‌ తలుపులను అమర్చుతారు. ఇవి ఫైబర్‌ గ్లాస్‌తో తయారైనప్పటికీ కలపతో చేసినవిగానే కనిపిస్తాయి. 
వాటర్‌ పైపులు కూడా ప్రత్యేకమైనవే ఉంటాయి. ఇవి వేడి నీటిని త్వరగా చల్లారనివ్వవు. 
ఇంటి ఆవరణలో మొక్కలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు. ఇంటి లోపల విద్యుత్‌ను ఆదా చేసే ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబులైట్లు, ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాన్లు అమర్చుతారు. 
వంట గది, బాత్‌రూమ్, టాయిలెట్‌.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ ఇంధన ఆదాను దృష్టిలో ఉంచుకుంటారు.  

మరిన్ని వార్తలు