ఇంటింటికీ రేషన్‌ తరహాలోనే..

26 May, 2021 05:38 IST|Sakshi

వివిధ కార్పొరేషన్ల పథకాల అమలులోనూ నిరుద్యోగులకు ఉపాధి

పరిశీలన బాధ్యత ఏపీఐడీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్‌ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ కార్యక్రమం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన విధానంలోనే.. వివిధ కార్పొరేషన్ల సంక్షేమ పథకాల అమలుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఐడీసీ)ను తిరిగి క్రియాశీలకం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సందర్భంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం పంపిణీ కార్యక్రమం అమలు బాధ్యతను సైతం ఏపీఐడీసీకే అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ జీవో జారీ చేశారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా 1960లో ఏపీఐడీసీ ఏర్పాటైంది. ఆ తర్వా త సంస్థ నామమాత్రంగా తయారైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిరుద్యోగులకు వాహనాలను సమకూర్చి ఇంటింటికీ బియ్యం పంపిణీ కార్యక్రమం బాధ్యతలను వారికి అప్పగించిన విషయం తెలిసింది. ఈ తరహాలోనే ఇతర ప్రభుత్వ పథకాల అమలులో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టే బాధ్యతను ఏపీఐడీసీకే ప్రభుత్వం అప్పగించింది. సంబంధిత శాఖలు, ఏపీఐడీసీ కలిపి ఎప్పటికప్పుడు వేర్వేరుగా విధివిధానాలు ఖరారు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో కొత్తగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులోనూ నిరుద్యోగ యువతకు తగిన తోడ్పాటు అందించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఐడీసీకి అప్పగించింది.  

మరిన్ని వార్తలు