ఆర్బీకేల వద్ద వే బ్రిడ్జిలు 

21 Sep, 2022 03:52 IST|Sakshi

ధాన్యం తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట 

తొలిదశలో డిసెంబర్‌ కల్లా 93 సిద్ధం 

ఒక్కొక్కటి రూ.19.95 లక్షల అంచనా వ్యయం 

60 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు 

సిబ్బందికి ప్రత్యేక గది, సీసీ కెమెరాలు   

సాక్షి, అమరావతి: పంట కొనుగోళ్లను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఎలక్ట్రానిక్‌ వే బ్రిడ్జిల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దళారీలు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గత వ్యవసాయ సీజన్‌ నుంచి ధాన్యంతో పాటు అన్ని రకాల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలుచేస్తున్నారు. ఖరీఫ్‌లో రూ.7859.30 కోట్ల విలువైన 40.38 లక్షల టన్నులు, రబీలో రూ.5245.23 కోట్ల విలువైన 26.98 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని అంచనా. 

రైతన్నలు నష్టపోకుండా...
ధాన్యంలో తేమ శాతాన్ని ఆర్బీకేల్లో ప్రస్తుతం మాయిశ్చర్‌ మిషన్‌ ద్వారా పరీక్షిస్తున్నారు. కొనుగోలు తేదీలను రైతులకు వెల్లడిస్తూ గన్నీ బ్యాగ్‌లు కూడా సరఫరా చేస్తున్నారు. ఆ సమయానికి రైతులు ధాన్యాన్ని గోతాల్లో నింపి కల్లాల వద్దే తూకం వేసి ఆర్బీకే పరిధిలోని రైసు మిల్లులకు తరలిస్తున్నారు. అయితే కల్లాల వద్ద రైతు వేసిన తూకానికి, మిల్లువద్ద వేసే తూకానికి వ్యత్యాసం వస్తోంది.

కల్లాల వద్ద వెయ్యి కిలోలున్న ధాన్యం బస్తాలు మిల్లు వద్ద తూకం వేస్తుంటే 900–950 కేజీలే ఉన్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసి రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధర లభించాలన్న సంకల్పంతో అవసరమైన చోట ఆర్బీకేల వద్ద వేబ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యేలోగా తొలిదశ వే బ్రిడ్జిల ఏర్పాటుకు అధికారుల సిద్ధమయ్యారు. 

ఐదు సెంట్ల స్థలంలో..
ఒక్కో వే బ్రిడ్జికి ఐదు సెంట్ల స్థలం అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు స్థలాలు అందుబాటులో ఉన్న ఆర్బీకేలకు తొలుత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు చెందిన 28 గోదాముల వద్ద ఇప్పటికే వే బ్రిడ్జిలుండగా కొత్తగా మరో 35 గోదాముల వద్ద వే బ్రిడ్జిల నిర్మాణానికి అనువైన స్థలాలున్నట్లు గుర్తించారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రెండు గోదాములతో పాటు 16కిపైగా వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాముల వద్ద కొత్తగా వే బ్రిడ్జిలను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితోపాటు వరి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో కనీసం 40 ఆర్బీకేల పరిధిలో కొత్తగా వే బ్రిడ్జిల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తమ్మీద 93 చోట్ల కొత్తగా వే బ్రిడ్జిల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్బీకేల పరిధిలో వీలైనంత మేరకు మరిన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

డిసెంబర్‌ నాటికి సిద్ధం!
60 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఒక్కో వే బ్రిడ్జి కోసం రూ.19.95 లక్షలు వ్యయం కానుందని అంచనా. ఈ మొత్తంతో  9  గీ 3 మీటర్ల పిట్‌లెస్‌ టైప్‌ వే బ్రిడ్జి, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, యూపీఎస్, సిబ్బంది ఉండేందుకు వీలుగా ఎంఎస్‌ క్యాబిన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ద్వారా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌కల్లా వీటిని అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు జరుగుతోంది.   

మరిన్ని వార్తలు