‘పేదల ఇంటికి’ మరింత సాయం

16 Aug, 2022 05:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్లు లేని పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇసుక ఉచితంగా ఇస్తోంది. సబ్సిడీపై ఐరన్, సిమెంట్‌ ఇతర నిర్మాణ సామగ్రి ప్రభుత్వమే సమకూరుస్తోంది.

మరో అడుగు ముందుకు వేసి ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంక్‌ రుణాలను అందిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటి నిర్మాణం చురుగ్గా సాగుతుంది. ఇళ్లు నిర్మించుకుంటున్న 4,38,868 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,548.24 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించింది. ఈ రుణాల మంజూరుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రుణాలు సకాలంలో మంజూరయ్యేలా సమన్వయం కోసం ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలో సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది.

మరో వైపు గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్‌ స్కోర్‌ అడ్డంకిగా మారిందని ప్రభుత్వం గుర్తించింది. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిల్‌ స్కోరు విషయాన్ని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. సిబిల్‌ స్కోర్‌ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్‌ఎల్‌బీసీ.. ఈ గృహాల లబ్ధిదారులకు సిబిల్‌ స్కోర్‌ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలివ్వడం గమనార్హం. దీంతో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ లబ్ధిదారులకు సులభంగా పావలా వడ్డీకి రుణాలు లభిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు