నీళ్లు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదానా?

7 Dec, 2021 10:43 IST|Sakshi

అప్పర్‌ భద్రపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం

సీడబ్ల్యూసీ అనుమతి తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌

చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి 

సాక్షి, అమరావతి: అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక సర్కార్‌ చేసిన ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలులోకి రాకముందే ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతివ్వడాన్ని ఆక్షేపించింది. దీన్ని తక్షణం రద్దు చేయాలని పట్టుబట్టింది. దీంతో రెండు రాష్ట్రాలతో చర్చించాకే అప్పర్‌ భద్రకు జాతీయ హోదా కల్పనపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన హైపవర్‌ కమిటీ సోమవారం వర్చువల్‌ విధానంలో సమావేశమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఇందులో పాల్గొన్నారు. అప్పర్‌ భద్ర నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 6.25 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ప్రాజెక్టు చేపట్టామని కర్ణాటక జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి అంచనా వ్యయంలో 90 శాతం నిధులివ్వాలని కేంద్రాన్ని కోరారు.

చదవండి: ఏపీలో అపర్ణ రూ.100 కోట్ల పెట్టుబడి

దీనిపై ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పర్‌ భద్రకు నీటి కేటాయింపులే లేవని స్పష్టం చేశారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కేవలం 9 టీఎంసీలే కేటాయించిందని, ఆ తీర్పు ఇప్పటివరకు అమలులోకి రాలేదని గుర్తు చేశారు. అప్పర్‌ భద్ర వల్ల కృష్ణా బేసిన్‌లో దిగువ రాష్ట్రమైన ఏపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణమే డిజైన్లు ఆమోదించాలి..
పోలవరం పనుల పురోగతిని హైపవర్‌ కమిటీకి అధికారులు వివరించారు. పెండింగ్‌ డిజైన్లను తక్షణమే ఆమోదించేలా డీడీఆర్పీ(డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌), సీడబ్ల్యూసీని ఆదేశించాలని కోరగా కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించారు. ఎప్పటికప్పుడు నిధుల రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పనులను మరింత వేగంగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్న  రాష్ట్ర అధికారుల అభిప్రాయంతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఏకీభవించారు. విభాగాల వారిగా పరిమితులు విధించకుండా అంచనా వ్యయాన్ని గంపగుత్తగా భావించి నిధులు విడుదల చేయాలని జలవనరులశాఖ అధికారులు కోరారు. డిస్ట్రిబ్యూటరీ పనులకు సంబంధించిన సర్వే పూర్తయిందని త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు