AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు

15 Feb, 2022 08:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరత అన్న మాటకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీగా నియామకాలు చేపట్టిన, చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ వైద్య విధాన పరిషత్‌లో మరో 2,588 పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ పోస్టులు సృష్టించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

చదవండి: AP: 'దారి'కొస్తున్నాయి.. ఒక్క ఏడాదిలో రూ.2,205 కోట్లు

కొత్తగా సృష్టించిన పోస్టుల్లో 485 డాక్టర్, 60 నర్సింగ్, 78 ఫార్మసీ, 644 పారామెడికల్‌ క్లాస్‌–4, 279 ల్యాబ్‌ టెక్నీషియన్, పోస్ట్‌మార్టమ్‌ సహాయకుల పోస్టులు 39, ఆసుపత్రి పరిపాలన విభాగానికి సంబంధించి 54 పోస్టులు ఉండగా, ఇతరత్రా పోస్టులు 949 ఉన్నాయి. వీటిలో పలు పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్‌సోరి్సం గ్‌ విధానంలో, మరికొన్ని పోస్టులను పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైద్య, ఆరోగ్య శాఖలో 39 వేల పోస్టుల భర్తీ చేపట్టింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టుల భర్తీ పూర్తవగా మిగిలిన పోస్టుల భర్తీ ఈ నెలాఖరుతో పూర్తికానుంది. ఇదే తరుణంలో మరో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వడం ప్రజారోగ్యానికి ప్రభుత్వం వేస్తున్న పెద్దపీటకు అద్దం పడుతోంది. 

మరిన్ని వార్తలు