‘ప్రకాశం’లో నిమ్జ్‌కు మోక్షం!

29 Aug, 2020 04:00 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో భారీ పారిశ్రామికవాడకు మార్గం సుగమం

మొత్తం 14,346.61 ఎకరాల్లో ఏర్పాటు 

మాస్టర్‌ప్లాన్‌ సిద్ధంచేస్తున్న వాయింట్స్‌ కన్సల్టెన్సీ 

రూ.45,000 కోట్ల పెట్టుబడులు.. 

లక్ష మందికి పైగా ఉపాధి వస్తుందని అంచనా

సాక్షి, అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రకాశం జిల్లాలోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించింది. 2012లో కేంద్రం దేశంలోనే తొలి నిమ్జ్‌ రాష్ట్రానికి కేటాయించినప్పటికీ ఇప్పటివరకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. వెనుకబడిన ప్రాంతంలో ఉపాధి కల్పించే నిమ్జ్‌పై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి కేంద్రంతో చర్చలు జరపడంతో అడుగులు ముందుకు పడ్డాయి. ఇందులో భాగంగా భూసేకరణ పనులు చేపడుతూనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుమారు 4,000 ఎకరాలను తొలిదశ కింద అభివృద్ధి చేసేందుకు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాక.. 

► మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి రూ.3 కోట్లను కేటాయించింది. 
► కేంద్రం నిధులు కేటాయించడంతో రాష్ట్ర మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి టెండర్లు పిలవగా వాయింట్స్‌ కన్సల్టెన్సీ సంస్థ ఆ అవకాశాన్ని దక్కించుకుంది. 
► వాక్‌ టు వర్క్‌ విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామికవాడలో మొత్తం భూమిలో 60 శాతం పారిశ్రామిక అవసరాలకు.. మిగిలిన 40 శాతం నివాస, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేస్తారు. 
► 14,346.61 ఎకరాల్లో ఎక్కడ ఏ పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలి, ఎక్కడ నివాస ప్రాంతాలు ఉండాలి అన్న విషయాలతో మాస్టర్‌ప్లాన్‌ తయారుచేస్తున్నామని.. ఇప్పటికే ఈ పనులు మొదలైనట్లు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతులు కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలæ వలవన్‌ తెలిపారు. 
► ఫార్మా, రక్షణ, జనరల్‌ ఇంజనీరింగ్, లాజిస్టిక్‌ ఇలా ఒకొక్క రంగానికి విడివిడిగా పారిశ్రామిక క్లస్టర్లలను అభివృద్ధి చేయనున్నారు. 
► తొలిదశలో అభివృద్ధి చేయనున్న 4,000 ఎకరాలకు సంబంధించి సమగ్ర నివేదకను వాయింట్స్‌ రూపొందిస్తుందని ఏపీఐఐసీ చీఫ్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ శ్రీనివాస ప్రసాద్‌ తెలిపారు.

గ్రామాలు ఖాళీ చేయకుండానే..
ప్రకాశం జిల్లా పామరు, పీసీపల్లి మండలాలకు చెందిన బోదవాడ, మాలకొండాపురం, అయ్యన్‌కొట, సిద్ధవరం, రేణిమడుగు, పైదర్లపాడు గ్రామాలకు చెందిన మొత్తం 14,346.61 ఎకరాల్లో ఈ భారీ పారిశ్రామికవాడ ఏర్పాటుకానుంది. ఈ మధ్యలో ఉన్న ఆరు గ్రామాలు ఖాళీచేయాల్సిన అవసరంలేకుండా, ఆ చుట్టుపక్కల తగినంత బఫర్‌ జోన్‌ ఉంచి, చుట్టుపక్కల ఎటువంటి ప్రమాదం లేని గ్రీన్‌జోన్‌ పరిధిలోకి వచ్చే పరిశ్రమలను ఏర్పాటుచేసేలా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు శ్రీనివాస ప్రసాద్‌ తెలిపారు. 
► పారిశ్రామిక అవసరాల కోసం నేరుగా రహదారితో పాటు, రైల్వేలైన్‌ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. 
► ఈ మొత్తం 14,346.61 ఎకరాలను అభివృద్ధి చేయడానికి సుమారు రూ.10,850 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. 
► ఇందులో కేంద్రం రూ.4,507 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.6,802 కోట్లు భరించాల్సి ఉంటుంది. 
► కానీ, ప్రస్తుతం నిమ్జ్‌ నిబంధనలను కేంద్రం సవరించిందని, కొత్త నిబంధనలు వస్తే కేంద్రం ఏ మేరకు భరిస్తుందన్న విషయంపై స్పష్టత వస్తుందన్నారు. 
► ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు రూ.45,000 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు రూ.20,000 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతాయని అంచనా. 
► అలాగే, ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా మరో లక్షన్నర మందికి ఉపాధి లభించనుంది. 

మరిన్ని వార్తలు