ఇళ్ల నిర్మాణాలకు పక్కా ప్రణాళిక

9 Jan, 2021 05:37 IST|Sakshi

క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలు డివిజన్‌ స్థాయి అధికారుల వరకు ప్రత్యేక శిక్షణ  

సచివాలయ సిబ్బంది కూడా హాజరు కావాలని ఉత్తర్వులు 

క్యూ ఆర్‌ కోడ్‌తో లబ్ధిదారుల వివరాలు తెలిసేలా ఏర్పాట్లు 

జిల్లా స్థాయి పర్చేజ్‌ కమిటీ ద్వారా నాణ్యమైన పరికరాల కొనుగోలు

సాక్షి, అమరావతి:  పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణాల్లో పాలుపంచుకునే క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి డివిజనల్‌ స్థాయి అధికారుల వరకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో మొదటి విడత 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్లు, సంక్షేమ/విద్య అసిస్టెంట్‌/వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ / వార్డు సౌకర్య (ఎమినిటీస్‌) కార్యదర్శుల పాత్ర, బాధ్యతలు, విధులపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. లబ్ధిదారుని వివరాల నమోదుతో పాటు ఇండెంట్, మెటీరియల్‌ సరఫరా, ఎం బుక్‌ రికార్డింగ్, చెల్లింపులు, సిఫార్సు వంటి కీలక బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు.  

కేఎల్‌ యూనివర్సిటీలో 18, 19న శిక్షణ  
► ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు గృహ నిర్మాణ, సచివాలయ సిబ్బందికి ఈ నెల 18, 19 తేదీల్లో విజయవాడలోని కేఎల్‌ యూనివర్సిటీలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు గృహ నిర్మాణ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది.  
► ఆలోగా ఈ నెల 9న డివిజన్‌ స్థాయిలో సిబ్బందికి ఓరియెంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిని సమన్వయం చేసుకుంటూ శిక్షణ కార్యక్రమానికి వంద శాతం సిబ్బంది హాజరయ్యేలా చూసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.  

క్యూఆర్‌ కోడ్‌తో లబ్ధిదారుల వివరాలు  
► క్యూఆర్‌ కోడ్‌తో లబ్ధిదారుల వివరాలు తెలిసేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో లబ్ధిదారుని ఇంటి పట్టా, లే అవుట్‌ పేరు, గ్రామ సర్వే నంబరు, కేటాయించిన ప్లాట్‌ నంబర్‌ వివరాలు ఉంటాయి.  
► క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే మంజూరైన స్కీము, ఇంటి విలువ, హౌసింగ్‌ ఐ.డి.నంబర్, జాబ్‌ కార్డు నంబర్, లబ్ధిదారుని బ్యాంకు ఖాతాతో పాటు ఎంత బిల్లు చెల్లించారు.. బిల్లు ఆలస్యమైతే అందుకు గల కారణాలు, ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయనే వివరాలు తెలుసుకోవచ్చు.   

పాసు పుస్తకంలో సమగ్ర వివరాలు 
► ఇంటి నిర్మాణానికి దశల వారీగా మంజూరు చేసిన మెటీరియల్‌తో పాటు నగదు చెల్లింపు వివరాలను లబ్ధిదారునికి ఇచ్చే పాసు పుస్తకంలో నమోదు చేస్తారు. బేస్‌మెంట్‌ లెవల్, రూఫ్‌ లెవల్, స్లాబ్‌ లెవల్, ఫినిషింగ్‌ స్థాయిలో బిల్లులు చెల్లిస్తారు.  
► 90 రోజుల పని దినాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే నగదు వివరాలు కూడా పొందుపరుస్తారు. లబ్ధిదారులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా సంబంధిత సిబ్బంది ఫోన్‌ నంబర్లు కూడా పాసు పుస్తకంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు