ఆరింటా అలరారేలా!

18 Apr, 2021 04:49 IST|Sakshi

ఆటో, ఫార్మా, రక్షణ, ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్, పీవీ సెల్స్‌ రంగాల్లో పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి 

పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

అభివృద్ధి చేసిన 23,042 ఎకరాలు సిద్ధం

రంగాల వారీగా ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీఐఐసీ 

సాక్షి, అమరావతి:  ఇప్పటికే ఎల్రక్టానిక్స్‌ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం 13 రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఉత్పాదక ఆథారిత ప్రోత్సాహకాలు (ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌–పీఎల్‌ఐ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కీలక రంగాలకు చెందిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓవైపు రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తూనే మార్కెట్‌ డిమాండ్‌ అనాలసిస్‌ నిర్వహిస్తోంది.

ఇప్పటికే పీఎల్‌ఐ స్కీం కింద ఎల్రక్టానిక్స్‌ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్ల(ఈఎంసీ)ను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం కీలకమైన మరో ఆరు రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించింది. నక్కపల్లి పారిశ్రామికవాడ కోసం ఎల్‌ అండ్‌ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌ సంస్థ నిర్వహించిన మార్కెట్‌ డిమాండ్‌ ఎనాలసిస్‌లో ఆటోమొబైల్‌ దాని అనుబంధ రంగాలు, ఫార్ములేషన్స్‌–డ్రగ్స్, ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్‌–స్పెషాల్టీ కెమికల్స్, ఏరో స్పేస్‌–డిఫెన్స్, ఇంటిగ్రేటెడ్‌ సోలార్‌ పీవీ సెల్స్‌ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అనువుగా ఉంటుందని అంచనా వేసింది. 

69,200 ఎకరాలు అవసరం: ఈ రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా ఎంత భూమి అవసరం అవుతుంది, ప్రస్తుతం మన రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంత భూమి అందుబాటులో ఉందన్న విషయంపై ఎల్‌ అండ్‌ టీ నివేదిక తయారు చేసింది. ఈ ఆరు కీలక రంగాల్లో 2022 నుంచి 2032 వరకు అంటే వచ్చే పదేళ్ల కాలానికి కొత్త యూనిట్లు ఏర్పాటు చేయడానికి సుమారు 69,200 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా ఆటోమొబైల్‌ రంగానికి 27వేలు, ఫార్మాస్యూటికల్స్‌ రంగానికి 17 వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా. రాష్ట్రంలో 13 జిల్లాల్లో మొత్తం 266 పారిశ్రామిక పార్కులు, కార్యకలాపాలు కొనసాగిస్తున్న సెజ్‌లు 32 వరకు ఉన్నాయి.

ఇప్పటివరకు సుమారు లక్ష ఎకరాలను అభివృద్ధి చేసిన ఏపీఐఐసీ రానున్న కాలంలో దీన్ని 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన పార్కుల్లో 6,221 ఎకరాలు, సెజ్‌లలో 16,821 ఎకరాలు కలిపి మొత్తం 23,042 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పెట్టుబడులకు అనుగుణంగా పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధిపై ఏపీఐఐసీ దృష్టి సారించింది. సుమారు 1.02 లక్షల ఎకరాల్లో మొత్తం 12 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి దశలో 8,673 ఎకరాల్లో ఆరు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా నక్కపల్లిలో పెట్రో కెమికల్స్, ప్రత్యేక రసాయనాలు, అచ్యుతాపురంలో ఇంజనీరింగ్, కాకినాడలో బల్క్‌ డ్రగ్స్‌ పార్క్, కృష్ణపట్నం నోడ్‌లో ఆటోమొబైల్, సోలార్‌ పీవీ సెల్స్, దొనకొండ ఏరో స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ రంగాలను ఆకర్షించే విధంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు