బీళ్ల చెంతకు నీళ్లు

7 Dec, 2020 21:58 IST|Sakshi

రూ.20,264 కోట్లతో 42 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సర్కారు ప్రణాళిక

50,36,356 ఎకరాలకు నీళ్లందించే లక్ష్యంతో వడివడిగా అడుగులు

ఈ సీజన్‌లోనే 6 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు కసరత్తు

సాక్షి, అమరావతి: బీడు భూముల్లోనూ నీరు పారించి.. రైతన్నల ఇంట సిరులు పండించేలా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికతో వడివడి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 42 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో 2024 నాటికి పూర్తి చేసేలా మున్ముందుకు వెళుతోంది. ఇందుకు రూ.20,264 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. వీటిని పూర్తి చేయడం ద్వారా కొత్తగా 24,82,071 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. వీటిని పూర్తి చేయడం ద్వారా 25,54,285 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి.. మొత్తమ్మీద 50,36,356 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సీజన్‌లోనే 6 ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలా..
గాలేరు-నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 ఫేజ్‌-2, వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులను ఈ సీజన్‌లోనే పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించడం ద్వారా కరువన్నదే లేని ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కార్యక్రమం చేపట్టారు. సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. అందులో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. దానికయ్యే వ్యయాన్ని భరిస్తామని హామీ ఇచ్చింది. దీనిని 2022 ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘జలయజ్ఞం’ కింద చేపట్టిన మిగిలిన 42 ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించింది.

మూడు విభాగాలుగా..
ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ, సాగులోకి వచ్చే ఆయకట్టు ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను మూడు విభాగాలుగా జల వనరుల శాఖ వర్గీకరించింది. కొత్తగా లక్ష ఎకరాలు సాగులోకి వచ్చే, రూ.500 కోట్లలోపు వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద గుర్తించింది. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వ్యయం చేయాల్సిన ప్రాజెక్టులు, కొత్తగా లక్ష కంటే ఎక్కువ ఎకరాలు సాగులోకి వచ్చే వాటిని రెండో ప్రాధాన్యతగా గుర్తించింది. ఈ రెండు విభాగాల కిందకు రాని ప్రాజెక్టులను మూడో ప్రాధాన్యత కింద వర్గీకరించింది. ఈ మూడు విభాగాల్లోని ప్రాజెక్టుల పనులను సమాంతరంగా చేస్తూ.. 2024లోగా అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా రూపొందించిన ప్రణాళికకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోద ముద్ర వేశారు.

పకడ్బందీగా ప్రణాళికతో..
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరిగితే అంచనా వ్యయం పెరగడంతోపాటు.. వాటి ఫలాలను రైతులకు అందించడం  ఆలస్యమవుతుందని భావించిన ‍ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తోంది. మొదటి ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో ఆరింటిని వచ్చే మార్చిలోగా పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. మరోవైపు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2022 నాటికి పూర్తి చేసేలా పనులను వేగవంతం చేసింది. ద్వితీయ ప్రాధాన్యం కింద చేపట్టిన సోమశిల-స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌, ముసురుమిల్లి, గజపతి నగరం బ్రాంచ్‌ కెనాల్‌ తదితర ప్రాజెక్టులను 2022 నాటికి పూర్తి చేయనుంది. తృతీయ ప్రాధాన్యత కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో హెచ్చెల్సీ ఆధునికీకరణ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాలను 2024 నాటికి సమగ్రంగా పూర్తి చేయాలని నిర్దేశించుకుంది.

2024 నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద చేపట్టి, నిర్మాణంలో ఉన్న 42 ప్రాజెక్టులనూ ప్రాధాన్యత క్రమంలో 2024 నాటికి పూర్తి చేస్తాం. జలయజ్ఞ ఫలాలను రైతులకు పూర్తి స్థాయిలో అందించి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
- డాక్టర్‌, పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌, జల వనరుల శాఖ మంత్రి

50 లక్షల ఎకరాలు సస్యశ్యామలం: 
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే 50.36 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. వీటిని 2024 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఆ దిశగా పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తున్నాం.
- ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జల వనరుల శాఖ

42 ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక ఇదీ..
ప్రాధాన్యత విభాగం    ప్రాజెక్టుల సంఖ్య    పూర్తి చేసేందుకు అయ్యే నిధులు (రూ.కోట్లలో)    కొత్త ఆయకట్టు    స్థిరీకరణ అయ్యే ఆయకట్టు (ఎకరాలు)
మొదటి    19    15,005    22,77,039    8,82,214
ద్వితీయ    9    1,104    1,35,547    1,43,722
తృతీయ    14    4,155    69,485        15,28,349
మొత్తం    42    20,264    24,82,071    25,54,285

మరిన్ని వార్తలు