కులాసా.. మత్స్యకార భరోసా

25 Apr, 2022 08:31 IST|Sakshi

వల.. మురిసేలా.. వేట విరామ సమయంలో సాయం

ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు అందజేత

ఈ ఏడాది 1,454 మందికి లబ్ధి

వరుసగా నాల్గో ఏడాది ఆర్థిక దన్ను

ఆటుపోటుల జీవితం.. సముద్రంలో వేటకు వెళితేగాని పూట గడవని బతుకు సమరం.. వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి.. పథకాలు ముంగిటకు వచ్చి చేరుతున్నాయి.. వేట విరామ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసా వారికి కొండంత అండగా నిలుస్తోంది. గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. వరుసగా నాలుగో ఏడాది మత్స్యకార భరోసా సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. వచ్చే నెలలో అర్హుల ఖాతాల్లోకి సొమ్ములను జమచేయనుంది.  

నరసాపురం : చేపల పునరుత్పత్తి సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. ఏటా ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు 61 రోజులపాటు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటారు. పడవలు, వలలు మరమ్మతులు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మత్స్యకార భరో సా పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో ఉన్న అర్హుల సంఖ్యను పెంచుతూ మరింత మందికి చేయూతగా నిలుస్తోంది. జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీరం ఉండగా నరసాపురం ప్రాంతంలో దాదాపు 2 వేల మంది వేటపై ఆధారపడి బతుకుతున్నారు.  

పాదయాత్ర హామీ మేరకు..  
పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురం వేదికగా వేట నిషేధ సా యా న్ని రూ.10 వేలకు పెంచుతానని ప్రకటించారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో మ త్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. అప్పటికి 173 మంది మాత్రమే అర్హులు ఉండగా ఆ సంఖ్యను 1,072కు పెంచి సాయం అందించారు. అలాగే 2020, 2021లో పథకాన్ని సమర్థవంతంగా అమలుచేశారు. ఈ ఏడాది కూడా పథకానికి అర్హులను గుర్తించారు. గతంలో సాయం నామమాత్రంగా ఉండగా ఈ ప్రభుత్వంలో వేలాది మందికి కోట్లాది రూపాయల లబ్ధి చేకూరుతోంది.  

గతంలో ముప్పుతిప్పలు
గతంలో వేట నిషేధ సాయం కోసం మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నిషేధం ము గిసి వేట ప్రారంభమైన ఐదారు నెలల తర్వాత కొద్దిమందికి మాత్రమే అరకొరగా సాయం అందించేవారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ, బడా నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. 2014కు ముందు రిలీఫ్‌ కమ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.600, కేంద్ర ప్రభు త్వం రూ.600 కలిపి రూ.1,200 అందించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. 2015లో 52 మందికి రూ.1.04 లక్షలు, 2016లో 46 మందికి 0.92 లక్షలు, 2017లో 104 మందికి రూ.4.16 లక్షలు, 2018లో 173 మందికి రూ.6.92 లక్షలు మా త్రమే నామమాత్రంగా అందించారు. 

జగన్‌ వచ్చాకే డబ్బులు వస్తున్నాయి  
మాకు ఏ పథకాలు ఉన్నాయో తెలిసేది కాదు. వేట విరామ సమయంలో రూపాయి వచ్చేది కాదు. జగన్‌ ముఖ్య మంత్రి అయిన తర్వాత మూడేళ్ల నుంచి వేట విరామ సమయంలో రూ.10 వేల చొప్పున మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఈ ఏడాది కూడా నాపేరు ఎంపిక చేశారు. వేట లేని సమయంలో ఇదే మాకు ఆధారం.  
– పెమ్మాడి గంటయ్య, మత్స్యకారుడు, నరసాపురం

చాలా ఆనందంగా ఉంది 
చిన్నప్పటి నుంచి వేట తప్ప మరేమీ తెలియదు. ఏటా వేసవిలో రెండు నెలలు వేట ఉండదు. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు అలాకాదు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నారు. అదీ నా బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఆనందంగా ఉంది. 
– మైలా రాముడు, పీఎం లంక, మత్స్యకారుడు

సర్వే పూర్తయ్యింది  
నరసాపురం తీరంలో మాత్రమే మత్స్యకార భరోసా లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలో 141 ఇంజిన్‌ బోట్లు ఉన్నాయి. వీటిపై పనిచేసే మత్స్యకార్మికులు 1,454 మందిని గుర్తించాం. వీరందరికీ మత్స్యకార భరోసా పథకానికి ఎంపిక చేశాం. ఈ మేరకు సర్వే పూర్తయ్యింది. వచ్చేనెలలో వీరందరికీ సొమ్ములు పడతాయి.  
– వి.ఏడుకొండలు, మత్స్యశాఖ అధికారి, నరసాపురం  

మరిన్ని వార్తలు