ప్రత్యామ్నాయాలపై కేంద్రం చెప్పడం లేదు

30 Aug, 2022 05:30 IST|Sakshi

కేంద్రాన్ని వివరణ కోరండి.. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం, పిటిషనర్లు

విశాఖ ఉక్కు కేసు విచారణ సెప్టెంబర్‌ 21కి వాయిదా

సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీ కరణకు బదులుగా దాన్ని లాభాలబాట పట్టించేం దుకు ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ మార్గా లను అన్వేషించిందా? లేదా? అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం తన కౌంటర్‌లో స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై కేంద్ర ప్రభు త్వాన్ని వివరణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టును అభ్యర్థించారు.

పిటిషనర్ల న్యాయవాదులు సైతం ఇదే రీతిలో కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు వల్ల నిర్వాసితులైనవారి కుటుంబసభ్యులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. అన్ని వ్యాజ్యాలను కలిపి సెప్టెంబర్‌ 21న విచారి స్తామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

విశాఖ ఉక్కు ప్రైవేటీక రణ నిమిత్తం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవా లు చేస్తూ మాజీ ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మీనా రాయణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సువర్ణరాజు అనే వ్యక్తి కూడా పిల్‌ దాఖలు చేశారు. వీటిపై పలుమార్లు విచారించిన సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ స్పందిస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులు, దాన్ని లాభాలబాట పట్టించేందుకు ప్రత్యామ్నాయాల అన్వేషణను నొక్కిచెబుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని చెప్పారు.

ముఖ్యమంత్రి లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కేంద్రం తన కౌంటర్‌లో పేర్కొనలేదన్నారు. దీనిపై కేంద్రాన్ని వివరణ కోరాలన్నారు. జేడీ లక్ష్మీనారాయణ న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ఉక్కు పరిశ్రమ కోసం ఎంతోమంది తమ భూములను ఇచ్చారన్నారు. దాదాపు 22 వేల ఎకరాలను ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్నారని తెలిపారు. భూములిచ్చినవారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలిస్తామన్న హామీ ఇన్నేళ్లయినా అలాగే మిగిలిపోయిందని చెప్పారు.

విశాఖ ఉక్కును లాభాలబాట పట్టించేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించారో లేదో కేంద్రం చెప్పడం లేదన్నారు. ఈ సమయంలో న్యాయవాది వై.కోటేశ్వరరావు స్పందిస్తూ.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో భూములు కోల్పోయి నిర్వాసితులు అయినవారి కుటుంబసభ్యులు పిటిషన్‌ దాఖలు చేశారని చెప్పారు. ఈ వ్యాజ్యాన్ని కూడా విచారించాలని కోరగా ధర్మాసనం అంగీకరించింది. 

మరిన్ని వార్తలు