ఆరోగ్య సిబ్బంది వైద్య ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే..

6 Jun, 2021 05:57 IST|Sakshi

కారంచేడు డాక్టర్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి నిధులు 

45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి సింగిల్‌ డోస్‌ పూర్తి 

వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

సాక్షి, అమరావతి: కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న డా.ఎన్‌.భాస్కరరావు వైద్యానికి అయ్యే వ్యయం మొత్తాన్నిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరు చేసినట్టు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ భాస్కరరావు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని, ఆయన వైద్యానికి రూ.కోటి నుంచి కోటిన్నర వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని సింఘాల్‌ ప్రస్తావించారు. ఆయన శనివారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మెరుగైన వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు.  

గతేడాది సెప్టెంబర్‌ నుంచి రూ.70 వేలు 
పీజీ వైద్య విద్య పూర్తయి సీనియర్‌ రెసిడెంట్‌లుగా పనిచేస్తున్న వారికి పెంచిన స్టైఫండ్‌ను 2021 జనవరి ఒకటో తేదీ నుంచి ఇద్దామనుకున్నామని, కానీ సీఎం వైఎస్‌ జగన్‌.. 2020 సెపె్టంబర్‌ నుంచే అమలు చేయాలని చెప్పినట్టు అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఈ మేరకు సెపె్టంబర్‌ నుంచే రూ.70 వేలు ఇస్తున్నామన్నారు. పీజీ పూర్తయినా పరీక్షలు జాప్యమై సీనియర్‌ రెసిడెంట్‌లుగా పనిచేస్తున్న వారికీ రూ.70 వేలు ఇస్తున్నామని, జూలైలో పరీక్షలు జరుగుతాయని, ఆ సమయంలోనూ వారికి స్టైఫండ్‌ చెల్లిస్తున్నట్టు చెప్పారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులిస్తామన్నారు.  

45 ఏళ్లు పైబడిన వారికి నెలలో వ్యాక్సినేషన్‌ పూర్తి  
ఇప్పటివరకూ టీకా తీసుకున్న హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను మినహాయిస్తే.. 45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి సింగిల్‌ డోసు పూర్తయిందని సింఘాల్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 1,06,47,444 డోసుల టీకాలు వేయగా, రెండు డోసులు తీసుకున్న వారు 25,67,162, సింగిల్‌ డోసు తీసుకున్న వారు 55,13,120 మంది ఉన్నారన్నారు. 45 ఏళ్లు దాటిన వారు, హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు మొత్తానికి కలిపి 53.8 శాతం ఒక డోస్‌ పూర్తయిందని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి నెల రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,460 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయినట్టు తెలిపారు. ఒక వేళ థర్డ్‌ వేవ్‌ వచ్చినా ముందస్తు అంచనాలు సిద్ధం చేశామన్నారు. టీకా వేసుకోని వారికే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. నెల్లూరు ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని వివరించారు. 

మరిన్ని వార్తలు