అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల డిపాజిట్‌

20 May, 2021 04:32 IST|Sakshi

ఈ సొమ్ము జాతీయ బ్యాంకులో జమ

చిన్నారులకు 25 ఏళ్లు వచ్చాకే డబ్బు తీసుకునే వెసులుబాటు

అప్పటివరకు దానిపై వచ్చే వడ్డీ నెలనెలా తీసుకోవచ్చు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సోకి తల్లిదండ్రులు మృతిచెంది అనాథలైన చిన్నారులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇలాంటివారిని గుర్తించి తక్షణమే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైనవారి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు జమ చేసి బాండ్‌ను వారికి అప్పగిస్తారని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. వారికి 25 ఏళ్ల వయసు నిండాక మాత్రమే ఈ డబ్బు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని నెలవారీగానీ, మూడు నెలలకు ఒకసారిగానీ తీసుకోవచ్చని తెలిపారు. ఎక్స్‌గ్రేషియాకు అర్హులైన అనాథ చిన్నారులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా కమిటీ వేశారు. జిల్లా వైద్యాధికారి సభ్యులుగా ఉండే ఈ కమిటీకి స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ పరిశీలించి కలెక్టర్‌కు పంపిస్తారు. 

ఎక్స్‌గ్రేషియాకు ఇవీ అర్హతలు
► దరఖాస్తు తేదీ నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి
► కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్లలు
► తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకుముందే మరణించి, ఇప్పుడు కోవిడ్‌ కారణంగా మరొకరు మృతిచెందిన వారి పిల్లలు 
► కుటుంబ ఆదాయం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి
► కోవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టును విధిగా చూపించాలి
► ఇతర బీమా సంస్థల నుంచి లబ్ధి పొందనివారు మాత్రమే అర్హులు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు