పశురక్షణకు ఏపీ సర్కారు దీక్ష.. 509 మంది సిబ్బందితో 94 బృందాలు.. 20 రోజులుగా సేవలు

1 Aug, 2022 04:05 IST|Sakshi
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా జి.పెదపూడి లంకలో పశువులకు వ్యాక్సిన్‌ వేస్తున్న వైద్య సిబ్బంది

గోదావరి వరదల్లో జీవాలను కాపాడిన యంత్రాంగం 

32 వేల పశువులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

7,574 పశువులకు ప్రాణం పోసిన వైద్యులు.. 7,945 పశువులకు అత్యవసర శస్త్రచికిత్స

102 వైద్య శిబిరాలు.. సేవలందించిన 94 బృందాలు

రూ.3.84 కోట్ల విలువైన 2,430 టన్నుల దాణా పంపిణీ

రూ.11.82 లక్షల మందులు, రూ.1.96 లక్షల మినరల్‌ మిక్చర్‌ కూడా

సాక్షి, అమరావతి: ‘ఏమ్మా.. మిమ్మల్నే కాదు.. మీ పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా..’ అంటూ ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరాతీస్తే అక్కడున్న ప్రతి పాడి రైతు ఆనందంతో అవునంటూ బదులివ్వడం గోదావరి వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుకు అద్దంపట్టింది. సాధారణంగా వైపరీత్యాల వేళ పెద్దసంఖ్యలో మృత్యువాతకు గురయ్యేవి మూగజీవాలే. ప్రభుత్వం ఈసారి ఆ పరిస్థితి రానివ్వలేదు.

దాదాపు 26 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికీ ఈసారి వేళ్లమీద లెక్కపెట్టదగినన్ని పశువులే ప్రాణాలు కోల్పోయాయంటే.. వాటి రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. 509 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన 94 బృందాలు 20 రోజులుగా సేవలందిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు సహాయ, పునరావాస చర్యలు కొనసాగించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో యంత్రాంగం అహరహం శ్రమిస్తోంది. 

పాడి రైతులకు అండగా..
వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 32 వేల పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీటికోసం 102 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. మృత్యువుతో పోరాడుతున్న 7,574 పశువులకు సకాలంలో వైద్యసేవలందించి వాటి ప్రాణాలను రక్షించారు. 243 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 7,945 పశువులకు అత్యవసర చికిత్స చేశారు. రూ.11.82 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశుపోషకులకు రూ.3.84 కోట్ల విలువైన 2,430 మెట్రిక్‌ టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్‌)తో పాటు రూ.1.96 లక్షల విలువైన మినరల్‌ మిక్చర్, ఇతర పోషకాలను ఉచితంగా పంపిణీ చేశారు. 30,770 పశువులకు వ్యాక్సిన్‌ వేశారు. ఈ ఐదు జిల్లాల పరిధిలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్‌ సంచార పశువైద్య సేవారథాలు వరద సహాయక చర్యల్లో విశేష సేవలందించాయి. మారుమూల వల్లెల్లో సైతం వీటిద్వారా వ్యాక్సినేషన్, అత్యవసర వైద్యసేవలు  అందించగలిగారు. 

700 పశువుల ప్రాణాలను కాపాడాం 
వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ కోసం ప్రభుత్వం çస్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయం. రాజమహేంద్రవరం–కొవ్వూరు మధ్య గోదావరి నదీగర్భంలోని లంకభూముల్లో 700కు పైగా పశువులు చిక్కుకున్నాయని సమాచారం ఇవ్వగానే పశుసంవర్ధకశాఖ తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. లేగదూడలు, పాలిచ్చే గేదెలు, ఆవులను ప్రత్యేక బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడినుంచి బొబ్బర్లంక గోశాలకు తరలించింది. మిగిలిన వాటికి పశుగ్రాసం, తాగునీరు, వైద్యసహాయం అందించింది. ఈసారి లంకల్లో చిక్కుకున్న ఏ ఒక్క పశువు మృత్యువాతపడలేదు.
– తేజోవంత్, రాష్ట్ర జంతుసంక్షేమ బోర్డు సభ్యుడు 

నిజంగా అభినందనీయం
లంకభూముల్లో దూడలు మేపుకొంటాం. 1986లో గోదావరి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. చాలా పశువులు చనిపోయాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వరదలకు ముందుగానే ప్రభుత్వం మమ్మల్ని అప్రమత్తం చేయడంతో మా పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పదిరోజుల ముందుగానే పశువులకు వ్యాక్సిన్‌ వేశారు. సంపూర్ణ మిశ్రమ దాణా అందిస్తున్నారు. మనుషులతో సమానంగా మూగజీవాల పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేసిన విధానం నిజంగా అభినందనీయం.
– పుచ్చకాయల నరసింహమూర్తి, పి.గన్నవరం

సీఎం ఆదేశాల మేరకు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సహాయ, పునరావాస కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తున్నాం. వరద ప్రభావిత గ్రామాల్లోని పశువులకు నూరుశాతం వ్యాక్సిన్‌ వేశాం. అవసరమైన దాణా, పశుగ్రాసం ఉచితంగా అందిస్తున్నాం.
– ఆర్‌.అమరేంద్రకుమార్, డైరెక్టర్‌ పశుసంవర్ధకశాఖ

మరిన్ని వార్తలు