అమరావతిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు 

13 Jul, 2022 04:30 IST|Sakshi

8 చోట్ల 5,024 ప్లాట్ల అభివృద్ధి పనులు 

అమృత వర్సిటీలో 150 ఎకరాల్లో నిర్మాణ పనులు పూర్తి 

ప్రవేశాలు ప్రారంభం 

హైకోర్టు తీర్పు ప్రకారమే ముందుకెళ్తున్నాం 

హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పేర్కొన్న ప్రభుత్వం 

తదుపరి విచారణ ఆగస్టు 23వ తేదీకి వాయిదా 

సాక్షి, అమరావతి: అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రాజధాని నగరాభివృద్ధి విషయంలో పలు చర్యలు చేపట్టామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం భూములను వేలం వేయాలని నిర్ణయించామని తెలిపింది. భూముల కనీస ధరను నిర్ణయించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం తరువాత వేలం విషయంలో ముందుకెళతామని పేర్కొంది.

అమరావతి ప్రాంతంలో 8 చోట్ల ఉన్న 5,024 ప్లాట్లకు సంబంధించిన బహిర్గత పనులు జరుగుతున్నాయని వివరించింది. అమరావతిలో ఇళ్లు లేని, అల్పాదాయ వర్గాల కోసం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్‌ కల్లా పూర్తవుతుందని వివరించింది. అమృత వర్సిటీకి కేటాయించిన 150 ఎకరాల్లో నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కూడా ఆ యూనివర్సిటీ ప్రారంభించిందని తెలిపింది.

రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల విషయంలో హైకోర్టు తీర్పులో నిర్దేశించిన గడువును పెంచాలని ఇప్పటికే అనుబంధ పిటిషన్ల రూపంలో కోర్టును కోరామని గుర్తు చేసింది. తాము ఏ రకంగానూ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని, అందువల్ల తమపై దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి కౌంటర్‌ దాఖలు చేశారు. 

కోర్టు ధిక్కార పిటిషన్లపై విచారణ 
ఇదిలా ఉంటే.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

గత నెల 5న ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి స్థాయీ నివేదిక (స్టేటస్‌ రిపోర్ట్‌)ను తమ ముందుంచాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తన కౌంటర్‌ను దాఖలు చేశారు. స్థాయీ నివేదికను కూడా జత చేశారు.

ఇందులో కోర్టు ధిక్కారం ఏముంటుంది? 
రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని నగర, ప్రాంతాన్ని అన్ని మౌలిక వసతులతో నెల రోజుల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై గతంలో ఓ ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. తాజాగా వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను 3 నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలు చేసినట్టు తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టినట్టు తాము పత్రికల్లో చదివామని తెలిపింది.

అభివృద్ధి పనుల స్టేటస్‌ రిపోర్ట్‌ సంగతి ఏమిటని ప్రశ్నించింది. గతంలో దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌లో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిందని, అలాగే స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించామని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ తెలిపారు. రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఐదేళ్ల గడువు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారని, ఆ గడువును తాము వ్యతిరేకిస్తున్నామని మురళీధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. గడువు పెంపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు కోర్టు ధిక్కారం ఏముంటుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు