విచారణ విధులకు డుమ్మా.. ఎందుకు చెప్మా?

17 Sep, 2022 19:13 IST|Sakshi
కొత్తూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోడౌన్‌

కొత్తూరు రేషన్‌ సరుకుల స్వాహా కేసులో దోబూచులాట 

స్థానిక అధికారుల తీరుపై సీరియస్‌ 

ఉన్నత విచారణకు నెల్లూరు విజిలెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌ నియామకం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్తూరు పౌర సరఫరాల గోదాంలో జరిగిన అక్రమాలను ఆ శాఖ సీరియస్‌గా తీసుకుంది. రూ.కోటికిపైగా సరుకులు పక్కదారి పట్టిన వైనంపై ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ మూడు నెలలుగా పర్యవేక్షణ లేదు. ఎవరూ భౌతిక తనిఖీలు చేపట్టిన దాఖలా కనిపించలేదు. దీంతో సరుకులు పక్కదారి పట్టాయి. ఈ మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రంగంలోకి దిగింది. ఈ గుట్టు రట్టు చేసేందుకు నెల్లూరులో పనిచేస్తున్న విజిలెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుధాకర్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన ఈ నెల 20న జిల్లాకు రానున్నారు. సంబంధిత ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని ఇప్పటికే ఆదేశించారు.
చదవండి: కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా

నిబంధనలు ఇవీ..  
రేషన్‌ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు, వసతి గృహాల కోసం పౌరసరఫరాల సంస్థకు చెందిన ప్రైవేటు గోడౌన్‌లో సరుకులు ఉంచుతారు.  
ప్రతి నెలా మూవ్‌మెంట్‌ జరుగుతూ ఉంటుంది. వచ్చిన నిల్వలు, సంబంధిత సరఫరా ఏజెన్సీలకు వెళ్లిన సరుకులు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలపై ప్రతి నెలా చివర భౌతిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది.  
తనిఖీలో గుర్తించిన విషయాలపై సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌కు నివేదిక అందించాలి.  
ఆ నివేదిక సవ్యంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.

వెలుగులోకి ఆసక్తికర విషయాలు..  
కొత్తూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను ఏప్రిల్‌ నెలలో తనిఖీ చేసేందుకు ఏఎస్‌ఓ వంశీని నియమించారు. అయితే ఆయనకు ట్రాన్స్‌ఫర్‌ కావడంతో తనిఖీలు చేయలేదు. మే నెలలో తనిఖీ చేసేందుకు ఏఎం అకౌంట్స్‌ జ్యోతిని నియమించారు. ఆమె కూడా అనారోగ్యం కారణం చూపి తనిఖీలకు వెళ్లలేదు. జూన్‌లో తనిఖీ చేసేందుకు ఏప్రిల్‌లో నియమించిన ఏఎస్‌ఓ వంశీనే మళ్లీ నియమించారు. బదిలీ కారణంతో ఆ నెలలో కూడా తనిఖీలకు వెళ్లలేదు. ఈయన మొదటిసారి తనిఖీ చేయకపోయినా రెండోసారి మళ్లీ ఆయననే తనిఖీ చేయాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు తనిఖీ చేయకుండా సాకులు చెప్పడం వెనుక కారణాలేంటి..? అన్న అనుమానాలూ బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా చేసిన తనిఖీలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక వచ్చిందా? లేదా? అన్నది సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ డీఎం కార్యాలయం చూసుకోవాలి. దీన్ని బట్టి ఏ నెల ఏం జరిగిందో ఒక అవగాహనకు వస్తారు. కానీ, ఇక్కడ ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో తనిఖీలు జరిగాయో లేదో, ఫిజికల్‌ విజిట్‌ నివేదికలొచ్చాయో లేదా అన్నది ఏ ఒక్కరూ గుర్తించలేదు. జూలై నెల వస్తే గానీ ఈ విషయం బయటపడలేదు. ఈలోపే అక్రమాలు జరిగిపోయాయి. అయితే ఇదంతా పథకం ప్రకారం జరిగిందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.

రామ్మోహన్‌పై చర్యలు.. 
భారీగా సరుకులు మాయమైన ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి, గ్రేడ్‌ 3 టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఈ.రామ్మోహనరావును ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. ఆయనతో పాటు అక్కడ పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డును కూడా విధుల నుంచి తొలగించారు. సరుకుల మాయంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దానితో పాటు సస్పెండైన రామ్మోహన్‌రావుపై చార్జెస్‌ ఫ్రేమ్‌ చేశారు. ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. దీంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై సివిల్‌ సప్లై అధికారులు ఆలోచిస్తున్నారు.

కుమ్మక్కయిందెవరు..
సరుకులు మాయమైన తర్వాత విచారణ చేస్తున్న కొద్దీ చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిగా ఉన్న రామ్మోహన్‌ ఆ గోడౌన్‌ తాళం వాచ్‌మెన్‌కు ఇచ్చేసి రెగ్యులర్‌గా విధులకు హాజరు కాలేదని తెలిసింది. వాచ్‌మెన్‌పైనే ఆ పాయింట్‌ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో 198.706 మెట్రిక్‌ టన్నుల బరువైన 3,982 బస్తాలు(50 కిలోలవి) బియ్యం, 176 బస్తాలు (50 కిలోలు) పంచదార, 148 పామాయిల్‌ ప్యాకెట్లు, 420బస్తాల(50కిలోలవి) కందిపప్పు  మాయమయ్యాయి. దీంతో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? దీంట్లో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి, వాచ్‌మెన్‌తో పాటు ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆరా తీయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందంటే ఈ ఇద్దరే కాదు మరికొంతమంది ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

20న జిల్లాకు ప్రత్యేక అధికారి..
కొత్తూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారిని ఉన్నతాధికారులు నియమించారు. ఈ నెల 20న జిల్లాకు వస్తున్నారు. రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని సమాచారం ఇచ్చారు. కొత్తూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జీగా పనిచేసిన రామ్మోహన్‌రావును సస్పెండ్‌ చేయడమే కాకుండా చార్జెస్‌ కూడా ఫ్రేమ్‌ చేశాం. దానిపై వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం.  
– బి.జయంతి, డిస్ట్రిక్ట్‌ మేనేజర్, జిల్లా పౌరసరఫరా సంస్థ     

మరిన్ని వార్తలు