‘డీలర్‌ డీల్‌’ పై ఏపీ సర్కార్‌ సీరియస్‌..

10 Sep, 2022 11:57 IST|Sakshi

టీడీపీ షి‘కారు’పై లోతైన పరిశీలన

ప్రజాధనం లూటీపై తదుపరి చర్యలకు సమాయత్తం

సాక్షి, అమరావతి: ఎస్సీ యువత ఉపాధి నిమిత్తం వాహనాలు ఇవ్వకపోగా, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని డీలర్లకు దారి మళ్లించిన బాగోతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ‘‘షికారు వెనుక డీలర్ల డీల్‌–ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు పరాయి పాలు’’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. డీలర్ల డీల్‌ విషయమై చట్టపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు ఏం జరిగాయి? డీలర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? తదితర కోణాల్లో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ చినరాముడు, జనరల్‌ మేనేజర్‌ సునీల్‌ రాజ్‌కుమార్‌ల నుంచి వాటికి సంబంధించిన రికార్డులు, ఆధారాలను ఉన్నతస్థాయి అధికారులు గురువారం పరిశీలించారు.
చదవండి: టీడీపీ సర్కార్‌ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్‌!

విజిలెన్స్‌ దర్యాప్తులో అనేక నిజాలు
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ యువత పేరుతో టీడీపీ నేతల బినామీలకు, వారు సిఫారసులు చేసిన వారికి కేటాయించి అసలు లక్ష్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్‌ దర్యాప్తులో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనికితోడు కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకుని ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వకుండా, డబ్బులు తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసిన డీలర్ల డీల్‌ వ్యవహారం తోడైంది.

నేషనల్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), నేషనల్‌ సఫాయి కర్మచారి ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌కెఎఫ్‌డీసీ) పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం గత ప్రభుత్వం రూ.365.67 కోట్లను డీలర్లకు అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో వాహనాలు ఇవ్వకుండా సుమారు రూ.67.68 కోట్లు డీలర్ల వద్దే ఉండిపోయాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

అడ్వాన్స్‌ను చెల్లించని డీలర్లు
ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత డీలర్లతో ఒకటి, రెండుసార్లు సమావేశం నిర్వహించి వాహనాలు ఇవ్వలేకపోతే, అడ్వాన్స్‌ డబ్బులైనా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇన్నోవాలు, ఇటియోస్‌లు ఇచ్చేందుకు అడ్వాన్సులు తీసుకున్న రాధా మాధవ్‌ ఆటోమొబైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (విజయవాడ) కంపెనీ రూ.23.05 కోట్లకు పైగా, కినెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌(పూణే), ఈగల్‌ అగ్రీ ఎక్విప్‌మెంట్‌ (కావలి) పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌ రూ.41.67 కోట్లకు పైగా, ఎంట్రాన్‌ ఆటోమొబైల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (పశ్చిమ గోదావరి జిల్లా) పేరుతో గమ్మిడి మోహిని రూ.2.93 కోట్ల మొత్తాన్ని వసూలుచేసేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. వాహనాలు ఇవ్వకుండా ప్రజాధనం లూటీచేసిన వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని తదుపరి చర్యలకు సమాయత్తమైంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధంచేస్తోంది. 

మరిన్ని వార్తలు