ఏపీ: ఉపాధికి ఊతమిచ్చేలా ఎంఎస్‌ఈ క్లస్టర్లు

14 Aug, 2021 11:22 IST|Sakshi

తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో 5 చోట్ల ఏర్పాట

తద్వారా 8,600 మందికి ఉపాధి

ఏటా రూ.117 కోట్ల వ్యాపార అంచనా

రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కువమందికి ఉపాధి కల్పించే చిన్న, సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎంఎస్‌ఈ–సీడీపీ) కింద ఐదు క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు ఏపీ ఎంఎస్‌ఎం ఈ కార్పొరేషన్‌ సీఈవో ఆర్‌.పవనమూర్తి తెలిపారు. ఎంఎస్‌ఈ–సీడీపీ కింద మొత్తం రూ.60.80 కోట్లతో 5 చోట్ల ఉమ్మడిగా వినియోగిం చుకునే విధంగా కామన్‌ ఫెసిలిటీ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఫర్నిచర్, మాచవరంలో పప్పు దినుసులు, కాకినాడలో ప్రింటింగ్,  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బంగారు ఆభరణాలు, నెల్లూరులో గార్మెంట్‌ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్టు పవనమూర్తి తెలిపారు. వీటికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ రూపంలో రూ.43.20 కోట్లు ఇవ్వనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.11.50 కోట్లు, క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కంపెనీ రూ.6.10 కోట్లు వ్యయం చేయనున్నాయి.

మహిళల కోసం గార్మెంట్‌ క్లస్టర్‌
ఈ ఐదు క్లస్టర్ల ద్వారా ఏటా రూ.117 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతాయని, సుమారు 8,600 మందికి ఉపాధి లభిస్తుందని ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ అంచనా వేసింది. నెల్లూరులో ఏర్పాటు చేసే గార్మెంట్‌ క్లస్టర్‌ను పూర్తిగా మహిళలకే ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చేస్తారు. కాకినాడలో ఏర్పాటు చేసే ప్రింటింగ్‌ క్లస్టర్‌లో అధునాతనమైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల తక్కువ వ్యయంతో నాణ్యతతో కూడిన ముద్రణ అందుబాటులోకి వస్తుంది.

ఇప్పుడు బంగారు ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి కావడంతో జగ్గయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న జ్యూవెలరీ క్లస్టర్‌లో ఆభరణాల స్వచ్ఛతను పరిశీలించి సర్టిఫికెట్‌ ఇచ్చే విధంగా ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇవి కాకుండా కాకినాడలో ఆటో ఇంజనీరింగ్‌ క్లస్టర్, నెల్లూరులో జ్యూవెలరీ క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనుల పంపామని, వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని పవనమూర్తి వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు