ఈ అలజడి ఎవరి మనోరథం?

9 Sep, 2020 04:27 IST|Sakshi
పూర్తిగా దగ్ధమైన అంతర్వేది రథం

‘అంతర్వేది’ ఘటనపై సత్వరమే స్పందించిన ప్రభుత్వం

పూర్తి స్థాయిలో దర్యాప్తు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు.. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు

దీనిని రాజకీయంగా వాడుకునేందుకు యత్నిస్తున్న శక్తులు

సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు రాజకీయ కుట్ర!

అంతర్వేదిలో బయట శక్తుల ప్రవేశం.. తీవ్రంగా పరిగణించిన సర్కారు

సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది.  ఘటనపై తక్షణం స్పందిస్తూ వెనువెంటనే చర్యలకు ఉపక్రమించింది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. ఈ ఘటన దురదృష్టకరమని, బాధ్యులు ఎవరైనాసరే విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఇంత చిత్తశుద్ధితో ప్రభుత్వం వ్యవహరిస్తుంటే కొందరు పనిగట్టుకుని దీన్ని రాజకీయం చేస్తూ.. ప్రజల్లో అలజడి సృష్టించాలని పన్నాగం పన్నినట్లు జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ ఘటన ఆధారంగా రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

సత్వరమే స్పందించిన ప్రభుత్వం
– జిల్లా మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, ఇతర అధికారులు ఆదివారం ఉదయమే ఆలయానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీంలు ఆధారాలు సేకరించాయి. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అగ్నిమాపక, దేవాదాయ, రెవెన్యూ అధికారులతో ఓ కమిటీని నియమించారు.
 
– విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఆలయ కార్యనిర్వాహణ అధికారి(ఈవో) నల్లం సూర్య చక్రధరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో యర్రశెట్టి భద్రజీరావును కొత్త ఈవోగా నియమించింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ సిబ్బంది, భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకుంది.  

– రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు వేణగోపాలకృష్ణ, పినెపి విశ్వరూప్‌ రెండవసారి మంగళవారం అంతర్వేది వెళ్లి దర్యాప్తు తీరును సమీక్షించారు.  

– కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు వెంటనే మంజూరు చేసింది. వచ్చే ఫిబ్రవరి నాటికి కొత్త రథం తయారవుతుందని మంత్రి వెలంపల్లి ప్రకటించారు. 

కుట్రకు యత్నిస్తున్న అసాంఘిక శక్తులు
– ఈ ఘటనలో ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని కుట్రలు పన్నుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా బయట నుంచి అసాంఘిక శక్తులను అంతర్వేదిలోకి పంపించి మరీ ఉద్రిక్తతలను సృష్టించడానికి యత్నించడం వారి కుట్రను తేటతెల్లం చేస్తోంది. 

– ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ పార్టీ నేతలు ముగ్గురితో కమిటీ వేశారు. ఆ కమిటీ ఆలయాన్ని పరిశీలించి రాజకీయ విమర్శలు చేయడం ద్వారా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు యత్నించడం గమనార్హం. 

– ఆ మర్నాడే కొందరు అసాంఘిక శక్తులు అంతర్వేదిలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు రంగంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ముగ్గురు మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు మంగళవారం నానా రభస చేయడమే కాకుండా దాడులకు తెగించడం గమనార్హం. విజయవాడ నుంచి వచ్చిన కొందరు ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. 

– వారు ఏకంగా అంతర్వేదిలో ఓ ప్రార్థనా మందిరంపై రాళ్లు రువ్వడం ఆందోళనకరంగా మారింది. ఉద్దేశ పూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించడానికే ఇంతకు తెగించారన్నది స్పష్టమవుతోంది. ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో వర్గ ఘర్షణలను రేకెత్తించడానికి రాజకీయ శక్తులు పకడ్బందీగా పన్నాగం పన్నుతున్నాయన్నది తేటతెల్లమవుతోంది. 

శాంతిభద్రతల పరిరక్షణకు అగ్రప్రాధాన్యం
– ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా ఉండాలని పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదనపు పోలీసు బలగాలను అంతర్వేదికి పంపింది.  

– రాళ్లు రువ్వి అంతర్వేదిలో అలజడులు సృష్టించేందుకు యత్నించిన దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ యాక్ట్‌ 30ని విధించారు. బయట వ్యక్తులు ఎవరూ అంతర్వేదిలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించారు. 

– అదనపు డీజీ(శాంతిభద్రతలు) రవిశంకర్‌ అయ్యన్నార్‌ అంతర్వేదిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆయన మంగళవారం రాత్రి విజయవాడ వచ్చి డీజీపీ గౌతం సవాంగ్‌కు పరిస్థితిని వివరించారు.

– ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావును అంతర్వేదిలో క్యాంప్‌ చేయాల్సిందిగా డీజీపీ సవాంగ్‌ ఆదేశించారు. ప్రస్తుతం అంతర్వేదిలో పరిస్థితి అంతా అదుపులో ఉంది.  
 
ఎంతటివారినైనా ఉపేక్షించం
అంతర్వేది ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశాం. కేసు దర్యాప్తులో ఇప్పటికే పురోగతి సాధించాం. పూర్తి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తాం. దోషులు ఎంతటి వారైనాసరే ఉపేక్షించం. మరోవైపు ఈ సంఘటనను అవకాశంగా చేసుకుని సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించాలని యత్నించే అసాంఘిక శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. పరిస్థితి అంతా అదుపులో ఉంది. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం.
– గౌతం సవాంగ్, డీజీపీ   

మరిన్ని వార్తలు