కదలిక గుర్తించి..ఆపద గట్టెక్కించి!

7 Oct, 2022 10:29 IST|Sakshi

పుంగనూరు, పలమనేరు పరిధిలో 90 ఏనుగుల సంచారం

పంటలను నాశనం చేసి.. స్థానికుల ప్రాణాలను బలిగొంటున్న వైనం

ఏనుగులను అదుపు చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి

50 మందితో ఏనుగుల ట్రాకింగ్‌.. బేస్‌ క్యాంపుల ఏర్పాటుకు చర్యలు

రాత్రీపగలూ కంటిమీద కునుకులేకుండా గ్రామాలపైకి దూసుకొస్తున్న ఏనుగుల మందను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రైతులు, పంటలకు శాశ్వత రక్షణ కల్పించేదిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న బేస్‌ క్యాంప్‌లు, ట్రాకర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఏనుగుల సంచారాన్ని గ్రామస్తులు, రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చని భావిస్తోంది. ఈ మేరకు అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో ఇటీవల ఏనుగుల సంచారం ఎక్కువైంది. రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటున్నారు. దీంతోపాటు పలువురు ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమస్యపై గతంలో పలువురు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో వెంటనే బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

ఏనుగుల కదలికలపై ప్రత్యేక దృష్టి 
ఇటీవల పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలాల్లో ఏనుగుల దాడులు పెచ్చుమీరాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసి, తద్వారా వాటి కదలికలను ఎప్పటికప్పుడు గ్రామస్తులకు తెలియజేయడంతో పాటు, వాటిని గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కుప్పం ప్రాంతంలో ఐదు, పలమనేరు పరిధిలో నాలుగు, చిత్తూరులో రెండు బేస్‌ క్యాంపులు ఉన్నాయి. వీటితోపాటు పెద్దపంజాణి, సోమల మండలాల్లో ఆవులపల్లి, పేటూరు ప్రాంతాల్లో కొత్త బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఇవి ఏర్పాటు చేస్తే ఒక్కో బేస్‌ క్యాంప్‌ సుమారు 40 నుంచి 50 చ.కి.మీ పరిధిలో ఏనుగుల కదలికలు గమనించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొత్తం మూడు బేస్‌ క్యాంపులకు కలిపి సుమారు 15 మంది ట్రాకర్లు అందుబాటులోకి రానున్నారు.  

సత్వర చర్యలకు అవకాశం
ట్రాకర్ల సహాయంతో ఏనుగుల కదలికలతో పాటు మిగిలిన అడవి జంతువుల గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందే అవకాశం ఉంది. గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే, ఆయా గ్రామాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేసేందుకు వీలుంటుంది. అదే విధంగా అటవీశాఖ అధికారులు కూడా టపాసులు, డప్పులు లాంటివి సిద్ధం చేసి ఆయా గ్రామాల వైపునకు ఏనుగుల గుంపు వెళ్లకుండా సత్వరచర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం పుంగనూరు రేంజ్‌లో  20 నుంచి 25 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇందులో 3 మదపుటేనుగులు ఉన్నాయి. అయినా గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేయలేదు.

ఇక బేస్‌ క్యాంపుల ఏర్పాటుతో ఏనుగుల బెడద బాగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 80 నుంచి 90 ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఏనుగుల కట్టడికి సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలమనేరు ప్రాంతంలో 6 కి.మీ సోలార్‌ ఫెన్సింగ్‌ పనులు జరుగుతున్నాయి. మరో 15 కి.మీ. దూరం సోలార్‌ ఫెన్సింగ్‌ వేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి.   

జనంలో నుంచి అరణ్యంలోకి.. 
జనారణ్యంలోకి వచ్చిన ఏనుగులను సురక్షితంగా తిరిగి అడవిలోకి పంపేందుకు సత్వర చర్యలు చేపట్టాం. తమిళనాడు, కర్ణాటక నుంచి ఏయే మార్గాల్లో ఏనుగులు వస్తున్నాయో గుర్తిస్తున్నాం. వాటి వల్ల ప్రజలకు, పంటలకు నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు చేపట్టాం. బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. 50 మందితో ఏనుగుల ట్రాకింగ్‌ చేస్తున్నాం. 

మరిన్ని వార్తలు