అక్రమ దందాలకు అడ్డుకట్ట

22 Aug, 2022 03:49 IST|Sakshi

సీసీటీఎన్‌ఎస్‌ పరిధిలోకి సెబ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను ప్రభుత్వం మరింత పటిష్టపరుస్తోంది. గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ తదితర దందాలను మరింత సమర్థంగా కట్టడిచేసేందుకు సెబ్‌కు సాంకేతిక సాధన సంపత్తిని సమకూరుస్తోంది. నేరపరిశోధనలో కీలకమైన క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎస్‌) పరిధిలోకి సెబ్‌ను తీసు కొచ్చింది. మరోవైపు గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ తదితర నేరాలు, నేరస్తుల డేటాను సమగ్రంగా రికార్డు చేయనుంది. తాజా విధాన నిర్ణయంతో శాంతిభద్రతల పోలీసు విభాగం, సెబ్‌లను అనుసంధానించనుంది. 

సమర్థంగా నేరపరిశోధన, నేరాల కట్టడి
నేరపరిశోధనలో సీసీటీఎన్‌ఎస్‌ అత్యంత కీలక విభాగం. వివిధ నేరాలు, ఆ కేసుల పరిశోధన, ఆ నేరాలకు పాల్పడిన వారి వివరాలు అన్నింటినీ సీసీటీఎన్‌ఎస్‌లో సమగ్రంగా రికార్డు చేస్తారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భద్రపరిచే ఈ వ్యవస్థ నేరపరిశోధనలో పోలీసు అధికారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇటువంటి వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసింది. అనంతరం కేంద్ర హోంశాఖ ఇదే వ్యవస్థను జాతీయస్థాయిలో నెలకొల్పింది. అటువంటి సమర్థమైన సీసీటీఎన్‌ఎస్‌ పరిధిలో ప్రస్తుతం శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు విభాగమే ఉంది.

గంజాయి, అక్రమ ఇసుక, అక్రమ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్‌ తదితర నేరాల కట్టడికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన సెబ్‌ను సీసీటీఎన్‌ఎస్‌ పరిధిలోకి తీసుకురావాలని పోలీసు శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులు, ఆ నేరస్తుల వివరాలన్నీ సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేస్తారు. ఆ నేరస్తుల స్వభావం, నేరాల చరిత్ర, పెండింగ్‌లో ఉన్న కేసులు తదితర సమాచారమంతా సెబ్‌ అధికారులకు అందుబాటులోకి వస్తుంది. ఆ కేసుల పరిశోధన కోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేరస్తులు, సిండికేట్‌లతో ఉన్న సంబంధాలు, వ్యాపార, ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ పోలీసులకు అందుబాటులోకి వస్తాయి. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో వ్యవస్థీకృతమైన ముఠాలు అక్కడి నుంచి మన రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ వంటి దందాలకు పాల్పడుతున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై ప్రస్తుతం సెబ్‌ దాడులు చేసి కేసులు నమోదు చేస్తోంది. తాజాగా సీసీటీఎన్‌ఎస్‌ పరిధిలోకి రావడంతో ఇతర రాష్ట్రాల్లోని ముఠాలపై కూడా కేసులు నమోదు చేసేందుకు, అక్రమ దందాను మూలాలతోసహా పెకలించేందుకు మార్గం సుగమమైంది. కేసు దర్యాప్తునకు దేశంలోని ఏ ప్రాంతాలకు వెళ్లాలో తెలియడంతోపాటు సంబంధిత రాష్ట్రాల పోలీసు, దర్యాప్తు సంస్థల సహకారం పొందడం సులభతరమవుతుంది.

పోలీసు, సెబ్‌ వ్యవస్థల అనుసంధానం
అక్రమ దందాలను అరికట్టడంతో పోలీసు, సెబ్‌ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీసీటీఎన్‌ఎస్‌ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్‌ కూడా చేరింది. అంటే సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్‌ పోలీసుస్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు బాస్‌ డీజీపీనే సెబ్‌కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అదే రీతిలో జిల్లాస్థాయిలో ఎస్పీల పర్యవేక్షణలోనే ఏఎస్పీల నేతృత్వంలో సెబ్‌ విభాగాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసు, సెబ్‌ విభాగాల మధ్య సాంకేతిక అంశాల్లో కొంత సందిగ్ధత ఉంది.

ప్రస్తుతం ఈ రెండు విభాగాలు కూడా సీసీటీఎన్‌ఎస్‌ పరిధిలోకి చేరడంతో వాటిమధ్య పూర్తి సమన్వయం సాధించినట్లయింది. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమర్థంగా కట్టడిచేసేందుకు అవకాశం ఏర్పడిం ది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగను న్నాయి. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేర స్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు.  

మరిన్ని వార్తలు