చేతి వృత్తికి చేయూత

20 May, 2021 05:53 IST|Sakshi
కొట్టక్కిలో బట్టలు నేస్తున్న చేనేత కార్మికుడు

ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని సర్కారు నిర్ణయం

రజకులు, చేనేతలు, నాయీ బ్రాహ్మణులకు లబ్ధి

ప్రభుత్వ నిర్ణయంతో బీసీ వర్గాల్లో హర్షం

రామభద్రపురం: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పలు అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఏటా చేతి వృత్తిదారులకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా అయితే ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేసిందో.. అదే విధంగా అర్హులైన పేద చేతివృత్తిదారులకు కూడా అందివ్వాలని నిర్ణయించింది. లాండ్రీ, బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులు, సెలూన్లు, చేనేత కార్మికులకు ఈ అవకాశం కల్పించింది. కరెంట్‌ బిల్లు, ఆధార్‌ కార్డు జెరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్‌ కార్డు జెరాక్స్, మొబైల్‌ నంబర్, అద్దెకు ఉంటున్నట్‌లైతే యజమాని ఆధార్‌ కార్డు జెరాక్స్, మొబైల్‌ నంబర్‌ వంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

రాయితీ విద్యుత్‌ ఇలా...
లాండ్రీ షాపులకు 150 యూనిట్ల వరకూ, బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులకు 100 యూనిట్ల వరకూ, సెలూన్‌ షాపులులకు 150 యూనిట్ల వరకూ, బట్టలు నేసే చేనేతలకు 100 యూనిట్ల వరకూ ఉచితంగా అందించనుంది. జిల్లాలో ఈ వృత్తిపై ఆధారపడిన దాదాపు 25 వేల మందికి లబ్ధి కలగనుంది.

చేతి వృత్తిదారులకు ఊరట..
కరోనా కష్టకాలంలో పనులు లేక అల్లాడుతున్న ఎంతోమందికి ఈ ఉచిత విద్యుత్‌ ఆదుకోనుంది. జిల్లాలో అత్యధిక బీసీలు చేతి వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది కోవిడ్‌ ఆంక్షలతో వృత్తి సజావుగా సాగక అనేక ఇబ్బందులు పడ్డారు. మళ్లీ సెకండ్‌ వేవ్‌తో మరింత కుంగిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ప్రకటించడంతో వారందరికీ ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి వై,ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో గతేడాది రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిపొందారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు...
సెలూన్లు, లాండ్రీ, దోబీ ఘాట్లు ఇలా చేతి వృత్తిదారులకు ఉచిత విద్యుత్‌ అందివ్వడం అభినందనీయం. ఇప్పటికే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పథకం అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– కల్లూరు త్రినాథరావు, చేనేత కార్మికల సంఘం చైర్మన్, కొట్టక్కి

తండ్రి హామీ నెరవేరుస్తున్న తనయుడు
దివంగత మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సెలూన్‌ దుకాణాలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తానని చెప్పారు. దీనిపై అప్పట్లో దుకాణాల సర్వే కూడా చేయించారు. దురదృష్ట వశాత్తూ తాయన మరణించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ హామీని నెరవేర్చుతున్నారు. 
– చీపురుపల్లి శ్రీను, మండల నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, రామభద్రపురం
బంగారు పనిచేస్తున్న కళాకారుడు 

సద్వినియోగం చేసుకోవాలి
విద్యుత్‌ సదుపాయంతో దుకాణాలు నిర్వహించే సెలూన్లు, లాండ్రి, బంగారం పని చేసే దుకాణాలు, మగ్గం పనిచేసేవారికి ప్రభుత్వం విద్యుత్‌ రాయితీలు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. అర్హులైన లబ్ధిదారులు మండల విద్యుత్‌ సెక్షన్‌ కార్యాలయానికి వెళ్లి ఆయా ఏఈల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం.     
   – వై.విష్ణు, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ 

మరిన్ని వార్తలు