భారీ పరిశ్రమలకు ప్రభుత్వం చేయూత

16 May, 2022 16:24 IST|Sakshi

స్థానిక నిరుద్యోగులకు అవకాశం

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి  గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనిస్తూ స్థానికంగా నిరుద్యోగులకు 75 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ప్రభగిరిపట్నంలో ఉన్న కిసాన్‌ క్రాఫ్ట్‌ వ్యవసాయ పనిముట్ల తయారీ పరిశ్రమను మంత్రి ఆదివారం కలెక్టర్‌ చక్రధర్‌బాబుతో కలిసి సందర్శించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న వ్యవసాయ పనిముట్ల యూనిట్‌ను మంత్రి, కలెక్టర్‌ కలిసి ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి హోదాలో కాకాణి ఫ్యాక్టరీని సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిసాన్‌ క్రాఫ్ట్‌ ఎండీ ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించాలని తన వద్దకు వచ్చిన వెంటనే అన్ని రకాలుగా సహాయ సహకరాలు అందించామన్నారు. ముందుగా వారితో నైపుణ్యతతో పని లేకుండా స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధన పెట్టామన్నారు. తన నిబంధనకు ఒప్పుకుని నిజాయతీగా యాజమాన్యం ఉద్యోగావకాశాలు కల్పించిందని తెలిపారు. మంచి కంపెనీ ఈ ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందని, భవిష్యత్‌లో మరో 300 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. త్వరలో రెండో యూనిట్‌ను ప్రారంభిస్తామని యాజమాన్యం చెబుతుందన్నారు. సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేందుకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు చేసిన కృషిని మరువలేమన్నారు.  

మంత్రి కృషి వల్లే పరిశ్రమ
పీజీపట్నం పంచాయతీలో 46 ఎకరాల్లో రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించిన కిసాన్‌క్రాఫ్ట్‌ ఫ్యాక్టరీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కృషి వల్లనే స్థాపించారని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అన్నారు. ఈ పరిశ్రమలో 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించడం మంచి పరిణామన్నారు.

జిల్లాలో మరో 18 భారీ పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ప్రభుత్వ ఉత్తర్వులు నిరుద్యోగ యువకులకు ఉపయోగపడుతుందన్నారు. ఫ్యాక్టరీ ఎండీ రవీంద్రఅగర్వాల్‌ను  కలెక్టర్‌ అభినందించారు. కిసాన్‌క్రాఫ్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా తమ ఉత్పత్తులను అందజేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కిసాన్‌క్రాఫ్ట్‌ ఎండీ రవీంద్ర అగర్వాల్‌ కంపెనీ పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ అంకిత్, సీఎఫ్‌ఓ అజయ్‌కుమార్‌ చలసాని, జీఎం కేఎల్‌ రావు, ఎంపీడీఓ పీ.సుజాత, తహసీల్దార్‌ వి.సుధీర్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు