కోవిడ్‌ బాధితులకు కొండంత అండ 

27 May, 2021 04:59 IST|Sakshi

పేద కుటుంబాలు చితికిపోకుండా ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి కరోనా, బ్లాక్‌ ఫంగస్‌  

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు కేటాయించి చికిత్స 

పడకలివ్వని ఆస్పత్రులపై చర్యలు 

ఇప్పటివరకూ 54 ఆస్పత్రులపై కొరడా.. రూ.3.72 కోట్లు జరిమానా  

సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం, చివరకు బ్లాక్‌ ఫంగస్‌ను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా చికిత్స అందించడం ద్వారా పేద రోగులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ రోగులకు కేటాయించాలనే నిబంధనతో వేలాది మందికి ఉచితంగా కరోనా చికిత్స అందుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. సుమారు 55 శాతం ప్రైవేట్‌ ఎం ప్యానల్డ్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నట్టు అంచనా వేశారు. ఇది 65 శాతానికి పెంచాలని భావిస్తున్నారు. 

116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతోంది. ఇందులో 2,288 ఐసీయూ పడకలు, 12,250 ఆక్సిజన్‌ పడకలు, 11,544 సాధారణ పడకల్లో సేవలు అందుతున్నాయి. ఈ కేసులన్నిటికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది. ఇవి కాకుండా 200 తాత్కాలిక ఎం ప్యానల్డ్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనూ సేవలు అందిస్తున్నారు. 

చికిత్సకు నిరాకరిస్తే కఠిన చర్యలు.. 
ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ బాధితులకు పడకలు కేటాయించని ఆస్పత్రులు, చికిత్స అందించని ఆస్పత్రులపై అధికారులు తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకూ 54 కేసులు నమోదు చేశారు. 11 ఆస్పత్రులను మూసి వేశారు. రూ.3.72 కోట్లు జరిమానా విధించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంత పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రి అయినా సరే ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

మానవత్వంతో వ్యవహరించాలి 
‘కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ఈ సమయంలో వ్యాపార దృక్పథంతో ఆస్పత్రులను నిర్వహించడం సమంజసం కాదు. తమ వంతు సాయంగా ప్రజలకు వైద్యం అందించేలా కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వంతో ఆలోచించాలి. సామాన్యులు, పేదలకు భరోసా కల్పించాలి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించిన ప్రతి ఆస్పత్రికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది’ 
–డాక్టర్‌ ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు