అక్కచెల్లెమ్మల ఆర్థిక ప్రగతికి సర్కార్‌ ‘చేయూత’

1 Apr, 2021 04:45 IST|Sakshi

వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల కింద లబ్ధిదారులకు రూ.వేల కోట్ల ఆర్థిక సాయం

ప్రభుత్వ సాయంతో వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న అక్కచెల్లెమ్మలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా.. వ్యాపారవేత్తలుగా రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాలను ప్రవేశపెట్టి అక్కచెల్లెమ్మల ఆర్థిక అభ్యున్నతికి, సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయూత, అలాగే పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు వైఎస్సార్‌ ఆసరా పథకాల పేరుతో ఇప్పటికే రూ.వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. వైఎస్సార్‌ చేయూత కింద 24.56 లక్షల మందికి తొలి విడతగా రూ.4,604 కోట్లు, వైఎస్సార్‌ ఆసరా కింద 87.75 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు తొలి విడతగా రూ.6,792 కోట్లు సాయం అందించారు. వీటికి అదనంగా బ్యాంకుల నుంచి కూడా మరింత ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ రెండు పథకాలను అందిపుచ్చుకున్న మహిళలు గత ఆరు నెలల్లో రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా రూ.74.91 కోట్ల విలువైన వస్తువులను విక్రయించారు.

ఇప్పటికే 67,055 రిటైల్‌ స్టోర్స్‌
రాష్ట్రంలో ఇప్పటికే 13,757 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 67,055 రిటైల్‌ స్టోర్స్‌ ప్రారంభమయ్యాయి. ఇందులో వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలకు చెందిన 50,491 మంది అక్కచెల్లెమ్మలకు రూ.221.50 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. మిగిలిన 1,247 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కూడా కనీసం ఒకటి చొప్పున చేయూత రిటైల్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేయించేందుకు సెర్ప్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,846 చేయూత రిటైల్‌ స్టోర్స్‌కు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించేందుకు చర్యలను చేపట్టారు. 

ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు.. 
వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల అక్కచెల్లెమ్మలకు వ్యాపారంలో సహకరించేందుకు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు.. హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్, అల్లానా, అమూల్, రిలయన్స్‌ రిటైల్‌ వంటి ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పాడి పరిశ్రమతోపాటు రిటైల్‌ స్టోర్స్, టెక్స్‌టైల్స్‌ తదితర రంగాల్లో లబ్ధిదారులు ఎంచుకున్న వ్యాపారాలకు బ్యాంకుల నుంచి అవసరమైన రుణాలను ఇప్పించేందుకు చర్యలను తీసుకుంటోంది. మరోవైపు జగనన్న పాలవెల్లువ కింద ఇప్పటికే చేయూత లబ్ధిదారులకు 16,203 యూనిట్లు, జగనన్న జీవక్రాంతి కింద 22,518 యూనిట్లను మంజూరు చేసింది. చేయూత, ఆసరా లబ్ధిదారులైన 16.25 లక్షల మహిళలకు మూడేళ్లలో జీవనోపాధిని కల్పించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌ ) కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. వైఎస్సార్‌ చేయూత ఉమ్మడి బ్రాండ్‌ పేరుతో ఆసరా, చేయూత లబ్ధిదారుల ఉత్పత్తులు, వస్తువులకు మార్కెటింగ్‌ కల్పించనుంది. వచ్చే మూడేళ్లలో అక్కచెల్లెమ్మల వ్యాపారాలకు మద్దతుగా పలు ఏజెన్సీలు, కంపెనీలను భాగస్వాములను చేసేందుకు సెర్ప్‌  చర్యలు తీసుకుంటోంది.

‘చేయూత’ ఆసరా ఇచ్చింది..
వైఎస్సార్‌ చేయూత పథకం మాకు ఆర్థిక భరోసా కల్పించింది. నాకు ముందుగా రూ.18,750 అందించారు. తర్వాత మా గ్రామంలో బ్యాంకు ద్వారా రూ.56,250 అందుకున్నాను. వీటితో నేను కిరాణా దుకాణాన్ని నడుపుతూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
– గొట్టాపు రమణమ్మ, మండవల్లి, కృష్ణా జిల్లా 

జిరాక్స్‌ మిషన్‌ పెట్టుకున్నా..
పన్నెండేళ్ల నుంచి నేను డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నాను. ఆసరా పథకం కింద మా గ్రూపునకు లక్ష రూపాయలు రుణమాఫీ అయ్యింది. సెర్ప్‌ తరఫున కూడా రుణం ఇచ్చారు. దీంతో నేను జిరాక్స్‌ మిషన్‌ పెట్టుకున్నాను. మరోవైపు చీరల దుకాణం కూడా నడుపుతున్నాను. సున్నా వడ్డీ డబ్బులు కూడా వచ్చాయి. ఇన్ని పథకాలను మాకు వర్తింపజేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. 
బి.సుజాత, ఎర్రముక్కపల్లె, వైఎస్సార్‌ జిల్లా  

మరిన్ని వార్తలు