ట‘మాట’ ప్రకారం రైతన్నకు అండగా 

11 Aug, 2022 03:52 IST|Sakshi

మూడేళ్లలో రూ.4.11 కోట్లతో 2,540 టన్నుల కొనుగోలు

ఒక్క అనంతపురం మార్కెట్‌లోనే 250 టన్నుల కొనుగోలు

ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌ జోక్యంతో రంగంలోకి ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్ల ద్వారా విక్రయాలు

అనంతలో డెమో యూనిట్‌..నిత్యం 200 కిలోల ప్రాసెసింగ్‌

బుధవారం అనంతపురం మార్కెట్‌లో కిలో గరిష్టంగా రూ.20

సాక్షి, అమరావతి/అనంతపురం అగ్రికల్చర్‌: తెలుగుదేశం హయాంలో ఏనాడూ టమాటా రైతుల్ని ఆదుకున్న దాఖలాలు లేవు. రైతు సమస్యల పట్ల పూర్తి అవగాహన, వారికి మంచి చేయాలన్న తపన ఉన్న ముఖ్యమంత్రి జగన్‌... తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అవసరమైనపుడల్లా టమాటా రైతుల్ని ఆదుకుంటూనే వస్తున్నారు. ధరలు పతనమైన ప్రతిసారి అండగా నిలుస్తున్నారు. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులను ఆదుకుంటున్నారు. రైతన్నకు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో టమాటా పండే జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. 

నేడు 14 రాష్ట్రాలకు..
రాష్ట్రంలో ఏటా 22.16 లక్షల టన్నుల టమాటా దిగుబడులు వస్తుండగా 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. ఇందులో మూడొంతులు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. గతంలో ఐదారు రాష్ట్రాలకే ఎగుమతులు జరగ్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా 14 రాష్ట్రాలకు పెరిగాయి. గతేడాది నవంబర్‌లో టమాటా ధర ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకింది. మార్కెట్‌లో కిలో రూ.100కిపైగా పలికింది. ఈ సమయంలో రైతుల నుంచి సుమారు వంద టన్నుల వరకు కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో రూ.60 చొప్పున విక్రయాలు చేపట్టి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని నియంత్రించింది.

ఎన్నడూలేని రీతిలో గత మూడేళ్లలో రూ.4.11 కోట్ల విలువైన 2,540.34 టన్నుల టమాటాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క అనంతపురం మార్కెట్‌లోనే 250 టన్నులు కొనుగోలు చేసింది. మహిళాభివృద్ధి సంస్థ ద్వారా రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్‌ కంపెనీలకు సరఫరా చేసింది. పైనాపిల్‌ రైతులను కూడా ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. కాయ రూ.10 చొప్పున 200 టన్నులకు పైగా సేకరించి సబ్సిడీపై మహిళా సంఘాల సభ్యులకు రూ.5కే అందచేసింది. అనాస రైతులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించి ఒక్కో కాయ రూ.12–15 వరకు గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ ‘ఈనాడు’ కథనంలో ప్రస్తావించకపోవటం గమనార్హం.

అది.. డెమో యూనిట్‌
‘ఈనాడు’ వార్తలో పేర్కొన్న టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌... అనంతపురం జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈ ఏడాది మార్చి 26న ప్రారంభించినది. అది కేవలం డెమో కోసమే ఏర్పాటైంది. కుటీర పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. మైసూరుకు చెందిన ఢిపెన్స్‌ ఫుడ్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ (డీఎఫ్‌ఆర్‌ఎల్‌) దీనికి సాంకేతిక సహకారం అందించింది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.7.50 లక్షలు, మార్కెటింగ్‌ శాఖ తరపున రూ.2.50 లక్షలతో కలిపి మార్కెట్‌యార్డు గోదాములో ఈ డెమో ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతలు వేదభూమి అనే రైతు ఉత్పత్తి దారుల సంఘానికి (ఎఫ్‌పీవో) అప్పగించారు.

ఇక్కడ రోజుకు 200 కిలోల టమాటా ద్వారా 40 కిలోల వరకు పల్ప్, సాస్‌ తయారు చేస్తున్నారు. కిలో సాస్‌ తయారీకి ఖర్చు రూ.130 కాగా మార్కెట్‌లో  రూ.170 వరకు విక్రయించేలా నిర్ణయించారు. డెమో ప్లాంట్‌లో సాంకేతిక లోపాలను సవరించి నాలుగైదు రోజుల్లో పునఃప్రారంభిస్తామని మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి చెప్పారు. నంద్యాలలో రూ.174.20 కోట్లతో, అన్నమయ్య జిల్లా పీలేరులో రూ.250 కోట్లతో  టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు కానున్నాయి.

అనంత మార్కెట్‌లో గరిష్టంగా కిలో రూ.20 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 2,500 హెక్టార్లలో టమాటా పంట ఉంది. ఇక్కడ నుంచి నాణ్యమైన టమాటాలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, నాగపూర్, కలకత్తా, బంగ్లాదేశ్‌ తదితర చోట్లకు ఎగుమతి అవుతుంటాయి. అనంతపురం కక్కలపల్లి మండీకి (ప్రైవేట్‌ మార్కెట్‌) రోజూ 6 వేల టన్నుల వరకు వస్తున్నాయి. వర్షాలతో కాయలు తడిచి రవాణాకు అనువుగా లేకపోవడంతో ధరలు తగ్గాయి.

సీఎం యాప్‌ ద్వారానే కాకుండా రైతుల నుంచి అందిన అభ్యర్థన మేరకు మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకొని కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. అనంతపురం మార్కెట్‌ పరిధిలో కిలో రూ.11 చొప్పున ఇప్పటి వరకు 600 క్వింటాళ్లు (60 టన్నులు) కొనుగోలు చేసి కర్నూలు, విశాఖ, విజయవాడ, గుంటూరు రైతు బజార్లకు తరలించారు. బుధవారం అనంతపురం మార్కెట్‌లో గరిష్టంగా కిలో రూ.20 ధర పలికింది. చంద్రబాబు హయాంలో ధరలు పతనమైనప్పుడు ‘ఈనాడు’ ఏనాడూ స్పందించకపోవటం ప్రస్తావనార్హం. 

ఆర్బీకేకి సమాచారమిస్తే చాలు...
ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం. మూడేళ్లలో రూ.4.11 కోట్ల విలువైన 2,540 టన్నుల టమాటాలు కొనుగోలు చేశాం. గతంలో ఎప్పుడూ ఇలా కొనలేదు. అనంతపురంలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ధర ఏమాత్రం తగ్గినా సమీపంలోని ఆర్బీకేకి సమాచారం అందిస్తే చాలు.. మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
– బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు  

మరిన్ని వార్తలు