పీహెచ్‌సీలు 24 గంటలూ 

11 Aug, 2020 04:02 IST|Sakshi

ప్రతి పీహెచ్‌సీలోనూ ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌ నర్సులు

రోజుకు 12 గంటలపాటు ఔట్‌పేషెంట్‌ సేవలు

త్వరలోనే ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం ఇప్పటికే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యానికి వెన్నుదన్నుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ ఇకపై 24 గంటలూ పనిచేయించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల వారు అనారోగ్యంతో ఏ సమయంలో వచ్చినా 24 గంటలూ వైద్యులను అందుబాటులో ఉంచనుంది. ఇప్పటివరకు 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీలు 520 మాత్రమే ఉండగా.. ఇప్పుడు మరో 625 పీహెచ్‌సీలను కలిపి మొత్తం 1,145ను 24 గంటలూ పనిచేసేలా మార్చనుంది. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

సేవలు నిరంతరం అందుబాటులో..
–ప్రస్తుతం చాలా పీహెచ్‌సీలకు ఒకే డాక్టర్‌ ఉండగా ఇకపై ప్రతి పీహెచ్‌సీకి షిప్టులవారీగా ఇద్దరు డాక్టర్లు ఉంటారు.
–రోజుకు 12 గంటలపాటు ఔట్‌పేషెంట్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.
–రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా బాధితుడు పీహెచ్‌సీకి వచ్చి ఫోన్‌ చేస్తే డాక్టర్‌ రావాల్సి ఉంటుంది. దీన్నే ఆన్‌ కాల్‌ అంటారు.
–ప్రతి పీహెచ్‌సీకి ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఉంటారు. వీళ్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు.
–పాముకాటు లేదా కుక్కకాటు వల్ల ఎవరైనా అర్ధరాత్రో, అపరాత్రో ఆస్పత్రికి వచ్చి ఫోన్‌ చేసినా 10 నిమిషాల్లోనే వైద్యులు రావాల్సి ఉంటుంది.
–170 రకాల మందులను ప్రతి పీహెచ్‌సీలో అందుబాటులో ఉంచుతారు.
–దీనివల్ల పేద రోగులకు మందుల ఖర్చులు బాగా తగ్గిపోతాయి.
–మండలానికొక అంబులెన్స్‌ ఉండటం వల్ల రవాణా సౌకర్యం కూడా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
–ప్రతి పీహెచ్‌సీకి 104 వాహనం అనుసంధానం చేసి ఉంటుంది. ప్రతి గ్రామానికి ఈ వాహనం వెళ్లి ఉచితంగా మందులు ఇస్తుంది.   

మరిన్ని వార్తలు