ఏపీలో ఉపాధి హామీ; 30 కోట్ల పని దినాలు

21 Jan, 2021 03:44 IST|Sakshi

ఇందుకు రూ.11,857 కోట్ల మేరకు వెచ్చించే అవకాశం

పథకం అమలుపై నేడు, రేపు పీడీలతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష  

2021–22లో రాష్ట్రంలో ‘ఉపాధి’ పనులపై ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యమిది

సాక్షి, అమరావతి: ఏప్రిల్‌ ఒకటవ తేదీతో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22)లో గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా 30 కోట్ల పని దినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు జిల్లాలవారీగా లేబర్‌ బడ్జెట్‌ ప్రాథమిక ప్రణాళికను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రూపొందించారు. ప్రస్తుతం నిర్ధారించిన ధరల ప్రకారం ఒక్కో పని దినానికి కూలీకి వేతన రూపంలో చెల్లించడానికి గరిష్టంగా రూ.237,  మెటీరియల్‌ ఖర్చులకు గరిష్టంగా రూ.158 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అంటే ఒక్కో పని దినానికి మొత్తం రూ.395 చొప్పున 30.02 కోట్ల పని దినాలను కూలీలకు కల్పించేందుకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.11,857 కోట్ల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చుపెట్టే వీలుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25.25 కోట్ల మేరకు పనిదినాలు కల్పించాలని నిర్దేశించుకోగా.. ఇప్పటి వరకు 22.50 కోట్ల పనిదినాలు కల్పించారు. 

నేడు, రేపు డ్వామా పీడీలతో సమావేశాలు
ఇదిలా ఉండగా, జిల్లాల్లో ఉపాధి హామీ పథకం నిర్వహణ తీరుపై సమీక్షించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురు, శుక్రవారాల్లో 13 జిల్లాల డ్వామా పీడీలతో తాడేపల్లిలోని కమిషనర్‌ కార్యాలయంలో సమావేశాలు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తారు.

పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లింపులు, ఈ పథకం ద్వారా నాటిన మొక్కలను వందశాతం బతికించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల్లో భాగంగా చేపడుతున్న గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, నాడు–నేడు కింద పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా జిల్లా అధికారులకు మంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తారు. 

మరిన్ని వార్తలు