ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం.. వరి రైతులకు రాయితీపై వరికోత యంత్రాలు

18 Aug, 2021 08:06 IST|Sakshi

ముగ్గురేసి రైతులతో యంత్ర సేవా కేంద్రాలు    

డిసెంబర్‌లోగా 500 కేంద్రాలు.. వచ్చే మార్చిలోగా మిగతావి ఏర్పాటు 

సాక్షి, అమరావతి: కూలీల కొరతతో వరి రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యను అధిగమించేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అలాగే వరి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో వరి కోత యంత్రాల(కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌)ను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్‌లోగా 500 కేంద్రాలు, మిగిలిన వాటిని వచ్చే ఏడాది మార్చిలోగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణంలో దాదాపు 60 శాతం తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే సాగవుతుంది.

ఈ జిల్లాల్లో పంట మొత్తం ఒకేసారి కోతకొస్తుండటం, ఆ సమయంలో కూలీలు దొరక్క, సరిపడా వరి కోత యంత్రాల్లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలను ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించి పంట కోత, నూర్పిడి చేయిస్తున్నారు. దీనివల్ల రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం రైతు సంఘాలను ఏర్పాటు చేసి.. వాటి ఆధ్వర్యంలో కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌తో కూడిన యంత్ర సేవా కేంద్రాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. తద్వారా గ్రామాల్లోనే తక్కువ అద్దెకు యంత్ర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.

5 యూనిట్లు మండలానికి..

ప్రభుత్వం అనుభవం కలిగిన ముగ్గురు రైతులతో ఒక్కో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసి వారిని కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌తో పాటు బేలర్‌(గడ్డిమోపు యంత్రం) కొనుగోలు చేసేలా ప్రోత్సహించనుంది. వారి ఆధ్వర్యంలోనే ఈ యంత్ర సేవా కేంద్రాన్ని నిర్వహిస్తుంది. 

► ఇందుకోసం 40 శాతం రాయితీ ఇస్తుండగా, 50 శాతం బ్యాంకు ద్వారా రుణం అందిస్తుంది. 

► మొత్తం నాలుగు జిల్లాల్లో 1,035 క్లస్టర్లలో యంత్ర సేవా కేంద్రాల కోసం ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద రూ.103.50 కోట్లు కేటాయించింది.

 3,706 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్న గ్రామాలను ఒక క్లస్టర్‌గా తీసుకుంటుంది. అలాగే మండలానికి ఐదు యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 

►  రైతులకు రూ.10 లక్షల రాయితీ వస్తుండగా, బ్యాంకు ద్వారా 12.50 లక్షల రుణం మంజూరు చేయనున్నారు.

►  మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి నిర్దేశించిన మేరకు యంత్రాల అద్దెలను వసూలు చేయాల్సి ఉంటుంది.
యువతకు స్వయం ఉపాధి 
యంత్ర సేవా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంపిక చేసిన యువతకు కంబైన్డ్‌ హార్వెస్టర్ల డ్రైవింగ్, నిర్వహణ, మరమ్మతులపై వివిధ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ శిక్షణ కేంద్రాల(ఎఫ్‌ఎంటీటీఐ) ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా వారు కంబైన్డ్‌ హార్వెస్టర్లను నడపడంలో ప్రావీణ్యం పొందనున్నారు. తద్వారా యంత్ర సేవా కేంద్రాలకు అనుబంధంగా స్వయం ఉపాధి సాధించనున్నారు.  

రైతులకు మేలు  
వరి ఎక్కువగా పండిస్తున్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 640 వరికోత యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పంట కోత సమయంలో డిమాండ్‌ పెరిగిపోతోంది. పక్క రాష్ట్రాల నుంచి యంత్రాలు తీసుకొస్తున్న రైతులకు ఖర్చు మోయలేని భారం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది.     – హెచ్‌.అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌

మరిన్ని వార్తలు