పెట్టుబడులతో రండి.. ప్రోత్సాహకాలు పొందండి

19 Feb, 2021 02:37 IST|Sakshi

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పెట్టుబడులకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు 

కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి.. 1,000 మందికి ఉపాధి కల్పించాలన్న నిబంధన 

ప్రతిపాదనలు సిద్ధం చేసిన రాష్ట్ర ఐటీ శాఖ

సాక్షి, అమరావతి: కేంద్రం తరహాలోనే ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్‌ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టి 1,000 మందికి ఉపాధి కల్పించే సంస్థలకు పదేళ్లపాటు అమ్మకాలపై ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. 2020–21ని బేస్‌ సంవత్సరంగా పరిగణించి అమ్మకాలను లెక్కిస్తారు. రూ.500 కోట్ల పెట్టుబడి.. 4,000 మందికిపైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు ఆయా పెట్టుబడుల ఆధారంగా మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నారు.

త్వరలో విడుదల చేయనున్న ఐటీ–ఎలక్ట్రానిక్స్‌ పాలసీ సందర్భంగా ఈ పీఎల్‌ఐ స్కీంను కూడా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించామని, ఆయన కొన్ని సూచనలు చేశారని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. వాటిని పరిగణనలోకి తీసుకొని త్వరలోనే నూతన పాలసీని విడుదల చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీఎల్‌ఐ స్కీం కింద దేశంలో పెట్టుబడులు పెట్టే సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేలా ఈ నూతన విధానం రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాగా, వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ రంగం విలువ 100 బిలియన్‌ డాలర్ల నుంచి 400 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని.. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో పీఎల్‌ఐ స్కీం ప్రవేశపెట్టనున్నట్లు ఈ మధ్య కలిసిన జపాన్‌ ప్రతినిధి బృందానికి సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.   

చదవండి: (ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు)

>
మరిన్ని వార్తలు