Andhra Pradesh: సేవలకు సత్కారం

29 Mar, 2022 03:13 IST|Sakshi

2.33 లక్షల మంది వలంటీర్లకు వరుసగా రెండో ఏడాది సన్మానం 

3 రకాల అవార్డులు, నగదు బహుమతులు, బ్యాడ్జి, సర్టిఫికెట్లు 

బయోమెట్రిక్, పింఛన్ల పంపిణీ, ఫీవర్‌ సర్వే ప్రాతిపదికన పాయింట్లు 

875 మందికి ‘సేవా వజ్ర’, 4,136 మందికి ‘సేవా రత్న’ 

2,28,322 మంది వలంటీర్లకు ‘సేవా మిత్ర’ అవార్డు

 4న నరసరావుపేటలో ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

పండుగలా రాష్ట్రమంతా నెల రోజుల పాటు కార్యక్రమాలు

సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటవ తేదీ తెల్లవారుజామున అవ్వాతాతలకు గుడ్‌మార్నింగ్‌ చెప్పి పింఛన్‌ డబ్బులతో సహా 35 రకాల సేవలను లబ్ధిదారుల ఇంటి ముంగిటకు చేరవేస్తున్న వలంటీర్లను వరుసగా రెండో ఏడాది కూడా సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పని చేస్తున్న 2,33,333 మంది వలంటీర్లను సత్కరించనుంది.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన వలంటీర్లను నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 875 మందిని ‘సేవా వజ్ర’ అవార్డుతో పాటు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్‌.. బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌తో సత్కరించనున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున, నగర కార్పొరేషన్‌కు పది మంది చొప్పున 4,136 మందికి ‘‘సేవా రత్న’’ అవార్డుతో పాటు రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌లను అందచేస్తారు. కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేని 2,28,322 మంది ‘‘సేవా మిత్ర’’ అవార్డుతో పాటు రూ.10 వేల నగదు బహుమతి అందుకోనున్నారు. 
 
నెలంతా పండుగలా..  
రాష్ట్రమంతటా నెల రోజుల పాటు పండుగలా ఎక్కడికక్కడ సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నూతన సంవత్సరాది ఉగాది నేపథ్యంలో ఏప్రిల్‌ నాలుగో తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేటలో వరుసగా రెండో ఏడాది వలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన కొద్ది మంది వలంటీర్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. అనంతరం సేవా వజ్ర, సేవా రత్న అవార్డు గ్రహీతలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఒక రోజు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో లేదంటే రెండు మూడు సచివాలయాలవారీగా సేవా మిత్ర అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమాలను  నిర్వహిస్తారు.  
 
3 అంశాల ఆధారంగా ఎంపిక.. 
కేవలం ప్రతిభ ఆధారంగానే పూర్తి పారదర్శక విధానంలో సేవా వజ్ర, సేవా రత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేశారు. సచివాలయంలో వలంటీర్ల బయోమెట్రిక్‌ హాజరు, పింఛన్ల పంపిణీ తీరు, కరోనా థర్డ్‌వేవ్‌లో ఇంటింటి ఫీవర్‌ సర్వే సందర్భంగా పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించారు. ప్రతి నెలా నిబంధనల ప్రకారం సచివాలయంలో బయోమెట్రిక్‌ హాజరు నమోదుకు 35 మార్కులు కేటాయించారు. పింఛన్ల పంపిణీకి మరో 35 మార్కులు నిర్దేశించారు. వలంటీరు తన పరిధిలో పింఛనుదారులందరికీ తొలిరోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తే 35 మార్కులు కేటాయిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే పంపిణీలో ఏ రోజు ఎన్ని పింఛన్లు పంపిణీ చేశారన్న అంశం ఆధారంగా ఆ 35 మార్కులను వర్గీకరిస్తారు. ఫీవర్‌ సర్వేకు మరో 30 మార్కులు కేటాయించి డిసెంబరు, జనవరిలో తమ పరిధిలోని మొత్తం ఇళ్లలో సర్వే పూర్తి చేసిన వారికి మార్కులు కేటాయించారు. 

దాదాపుగా అందరికీ.. 
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కలిపి 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 2,59,106 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 2,33,333 మంది అవార్డులు అందుకోనున్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా కనీసం ఏడాది పాటు విధులు నిర్వహించిన వారు అవార్డులు అందుకోనున్నారు.
 

మరిన్ని వార్తలు