ఈ–కామర్స్‌ వేదికపై మన హస్తకళలు

6 Apr, 2021 04:44 IST|Sakshi

450 రకాల ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ బ్రాండింగ్‌

హస్తకళా ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం

మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూత

స్వయంఉపాధి పథకాలకు రూ.118.49 కోట్లు మంజూరు చేసిన మెప్మా

సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న అవకాశాలను రాష్ట్ర హస్తకళాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సహకారంతో ఈ–కామర్స్‌ పోర్టళ్ల వేదికగా తమ ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ బ్రాండింగ్‌ చేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులైన హస్త కళాకారులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌ మార్కెట్‌లో విక్రయించేందుకు మెప్మా చేపట్టిన కార్యాచరణ విజయవంతమవుతోంది. ఇప్పటికే 450 రకాల హస్తకళా ఉత్పత్తులు ఈ–కామర్స్‌ పోర్టళ్లలో బ్రాండింగ్‌ దక్కించుకోవడం విశేషం. 

మెప్మా కార్యాచరణ
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 94,533 మంది హస్త కళాకారులు డ్వాక్రా సంఘాల సభ్యులుగా ఉన్నారు. సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ఆలంబనగా చేసుకుని వారు స్వయంఉపాధి రంగంలో రాణించేందుకు మెప్మా కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం ముందుగా స్వయం ఉపాధి పథకాల కోసం గ్రూపు రుణాలు, వ్యక్తిగత రుణాల కింద రూ.118.49 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించే బాధ్యతను కూడా చేపట్టింది. ప్రధానంగా విస్తృతమవుతున్న ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ రంగం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. మహిళలు తమ ఇళ్లలో తయారుచేసిన హస్త కళారూపాలను మార్కెటింగ్‌ చేసుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ఈ–కామర్స్‌ పోర్టళ్లలో రిజిస్ట్రేషన్‌ చేయించింది. అదేవిధంగా ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ సౌజన్యంతో డ్వాక్రా సభ్యులకు డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించింది. 

450 రకాల ఉత్పత్తులు
ఈ–కామర్స్‌ ద్వారా మార్కెటింగ్‌ కోసం జిల్లాలవారీగా హస్తకళలను మెప్మా ఎంపిక చేసింది. దాంతో ఆయా జిల్లాల డ్వాక్రా మహిళలు ఆ ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఏకంగా 450 రకాల హస్త కళా ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ పోర్టళ్లలో బ్రాండింగ్‌ పొందడం విశేషం. 

మహిళల స్వయంఉపాధికి ఊతం 
రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్న హస్తకళా ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. దీంతో మహిళల స్వయంఉపాధి అవకాశాలు పెరిగి మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. ఇప్పటివరకు 450 రకాల ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో బ్రాండింగ్‌ చేయించాం. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తాం.
– వి.విజయలక్ష్మి, మిషన్‌ డైరెక్టర్, మెప్మా 

మరిన్ని వార్తలు