‘ఏపీఎస్‌డీసీ’పై విచారణ సెప్టెంబర్‌ 7కు వాయిదా 

27 Aug, 2021 08:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం రూ.25 వేల కోట్ల రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ)కు చట్టబద్ధ హోదా కల్పిస్తున్న ఏపీఎస్‌డీసీ చట్టంలోని సెక్షన్లు 3(3), 4లతో పాటు ఆర్థికశాఖ జారీచేసిన పలు జీవోల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిల్‌పై తదుపరి విచారణను హైకోర్టు సెపె్టంబర్‌ 7వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను రాష్ట్ర సంచితనిధిలో జమచేయకుండా ఏపీఎస్‌డీసీకు బదలాయించేందుకు అధికారం కల్పిస్తున్న ఏపీఎస్‌డీసీ చట్టంలోని సెక్షన్‌ 12(1)(4), (5)లను చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దుచేయాలని కోరుతూ దాఖలైన మరో వ్యాజ్యంలో కూడా విచారణ అదేరోజుకు వాయిదా వేసింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఎస్‌డీసీ చట్టబద్ధతపై విజయవాడకు చెందిన కన్నెగంటి హిమబిందు, ఏపీఎస్‌డీసీకి ఆదాయాల బదలాయింపుపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. 

ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. సంచితనిధి నుంచే నిధులు ఏపీఎస్‌డీసీకి వెళుతున్నాయన్నారు. ఇదే అంశంపై ఓ పిల్‌ ఇప్పటికే దాఖలై ఉండగా, మరో పిల్‌ అవసరం లేదన్నారు. వెలగపూడి తరఫున సీనియర్‌ న్యాయవాది బసవప్రభుపాటిల్‌ వాదనలు వినిపిస్తూ మరిన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందుంచేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.
 

మరిన్ని వార్తలు