AP High Court: ఏబీఎన్, టీవీ 5లకు గట్టి షాక్‌

20 Oct, 2022 02:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిని, కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు విచారణకు రావాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన ఏబీఎన్‌ వెంకట కృష్ణ, టీవీ 5 మూర్తిలకు గట్టి షాక్‌ తగిలింది. దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ వారిద్దరూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది.

సీఐడీ నోటీసులు చెల్లవని, వాటిని కొట్టేయాలన్న వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాగే సీఐడీ విచారణ పరిధిపై వారు లేవనెత్తిన అభ్యంతరా లన్నింటినీ కొట్టేసింది. ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు ఒకదాని కొకటి పొరుగు పోలీస్‌స్టేషన్లు అవుతాయని తేల్చిచెప్పింది. అందువల్ల సీఐడీ నోటీసులు చట్ట నిబంధనలకు లోబడే ఉన్నాయని, అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. విచా రణకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది.

ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు సంబంధించి వెంకటకృష్ణ, మూర్తిల వ్యక్తిగత హాజరు నిమిత్తం ఓ తేదీని ఖరారు చేసి ఆ విషయాన్ని రాతపూర్వకంగా వారికి తెలియచేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణ సందర్భంగా వారిపై కఠిన చర్యలేవీ తీసుకోవ ద్దని సూచించింది. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని.. అందుకు విరుద్ధంగా వ్య వహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ తీర్పునిచ్చారు.  

కుట్రలో భాగంగానే వ్యాఖ్యలు..
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా సీఎం జగన్, పలు కులాలను అవమాన పరిచేలా, విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్, టీవీ 5 చానెళ్లపై సీఐడీ గతేడాది సుమోటోగా కేసు నమోదు చేసింది. దీనిపై రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయడంతో పాటు దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఏబీఎన్, టీవీ 5 చానెళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు సైతం దర్యాప్తును నిలుపుదల చేసేందుకు నిరాకరించింది.

ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం 
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సీఐడీకి రాష్ట్రం మొత్తం ఓ పోలీస్‌స్టేషన్‌ అవుతుందని, అందువల్ల దానికి పొరుగు పోలీస్‌స్టేషన్‌ అంటే తెలంగాణ సీఐడీ అవుతుందని తేల్చిచెప్పారు. సెక్షన్‌ 160(1), సెక్షన్‌ 2(ఎస్‌)లను కలిపి చదివితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీస్‌స్టేషన్లు ఒకదానికొకటి పొరుగు పోలీస్‌స్టేషన్లు అవుతాయన్నారు. దీని ప్రకారం పిటిషనర్లకు సీఐడీ ఇచ్చిన నోటీసులు చట్ట నిబంధనలకు లోబడి ఉన్నాయని, అందువల్ల అవి చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు.  

నోటీసులు ఇచ్చే పరిధి సీఐడీకి లేదంటూ పిటిషన్లు.. 
దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ వెంకటకృష్ణ, మూర్తిలకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ వెంకటకృష్ణ, మూర్తి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ విచారణ జరిపారు. సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించగా, మూర్తి తరఫున పీవీజీ ఉమేశ్, వెంకటకృష్ణ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

కేసు ఏపీలో నమోదు చేశారని, పిటిషనర్లు మాత్రం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని, అందువల్ల వారికి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులు ఎంతమాత్రం చెల్లవని పోసాని, ఉమేశ్‌ వాదించారు. అయితే ఈ వాదనలను ఏజీ శ్రీరామ్‌ తోసిపుచ్చారు. ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నిర్దిష్ట భౌగోళిక పరిధులు నిర్ణయించడం జరుగుతుందని, అలాగే సీఐడీకి రాష్ట్రం మొత్తాన్ని ఓ పోలీస్‌స్టేషన్‌గా పరిగణించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తం ఓ పోలీస్‌స్టేషన్‌ అయినప్పుడు ఏపీ సీఐడీకి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌ అంటే తెలంగాణ అవుతుందని తెలిపారు.     

మరిన్ని వార్తలు