ఆ కాన్సెప్ట్‌ని సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తెస్తున్నారు: కృష్ణబాబు

18 Aug, 2022 19:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తెస్తున్నామని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రతి మండలానికి అందుబాటులోకి నలుగురు వైద్యులు, విలేజ్‌ క్లినిక్‌లకు భవనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనిద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇళ్ల వద్దకు వెళ్లే వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మండలానికి 4 డాక్టర్‌లు అందుబాటులోకి వస్తారు. డాక్టర్ మారినా నెంబర్ మాత్రం పర్మనెంట్‌గా ఉండేలా చేస్తాం.

ఏ సమస్య ఉన్న ఏ సమయంలో అయినా డాక్టర్‌కి ప్రజలు కాల్ చేసే అవకాశం కల్పిస్తాం. వీటికి తర్వాత ఏరియా ఆస్పత్రి డాక్టర్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటాం. ఏ కుటుంబానికి ఆరోగ్య సమస్య వచ్చినా మా డాక్టర్ ఉన్నారన్న నమ్మకం కల్పిస్తాం. డాక్టర్‌లకు ఇది మంచి పేరు తెచ్చుకునే అవకాశం. గ్రామ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 42,000 పోస్టులను భర్తీ చేశాము. ఇంకో 4 వేల మందిని నియమిస్తాం. సంక్రాంతి నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పైలెట్ లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని కృష్ణబాబు తెలిపారు.

చదవండి: (CM Jagan: చీమకుర్తిలో పర్యటించనున్న సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు