జెడ్పీటీసీ, ఎంపీటీసీ వ్యాజ్యాల్లో విచారణ 8కి వాయిదా

6 Mar, 2021 04:00 IST|Sakshi

ఈ వ్యాజ్యాల్లో ఇప్పటి వరకు కౌంటర్‌ దాఖలు చేయని ఎస్‌ఈసీ

ఎన్నికలను జాప్యం చేసేందుకే ఎస్‌ఈసీ కౌంటర్లు దాఖలు చేయడం లేదన్న ప్రభుత్వ న్యాయవాది

సోమవారం కల్లా కౌంటర్లు వేయాలని ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం

లేకుంటే కౌంటర్లు లేనట్టుగా భావించి విచారణ జరుపుతామన్న న్యాయమూర్తి

జాప్యానికి క్షమాపణ కోరిన ఎస్‌ఈసీ న్యాయవాది

సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల్లో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేసి, ఆ కాపీలను పిటిషనర్లు, ఇతర ప్రతివాదులకు అందచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అప్పటికల్లా కౌంటర్లు దాఖలు చేయకపోతే, ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు లేనట్లుగానే భావించి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గత నెల 18న ఉత్తర్వులిచ్చారు.

బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై ఫిబ్రవరి 20వ తేదీకల్లా నివేదికివ్వాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులకనుగుణంగా అదేరోజు ప్రెస్‌నోట్‌ జారీ చేశారు. ఈ ఉత్తర్వులను, ప్రెస్‌నోట్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి.. రద్దు చేయాలని కోరుతూ పలువురు పిటిషన్లు వేశారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్‌ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ పిటిషన్‌ వేసింది. ఈ వ్యాజ్యాలన్నీ గత వారం విచారణకు రాగా, కౌంటర్ల దాఖలుకు ఎన్నికల కమిషన్‌ గడువు కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. మార్చి 3 వరకు గడువిచ్చారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వివేక్‌ చంద్రశేఖర్, ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌లు స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎన్నికల కమిషన్‌ కౌంటర్లు దాఖలు చేయలేదన్నారు.

ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోందన్నారు. ఈ నెల 3వ తేదీకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ వ్యాజ్యాలను అడ్డంపెట్టుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేయాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోందని సుమన్‌ అన్నారు. అందుకే కౌంటర్ల దాఖలులో జాప్యం చేస్తోందన్నారు. ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. కౌంటర్ల దాఖలులో జరిగిన జాప్యానికి కోర్టును క్షమాపణ కోరారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తే, ఆలోగా కౌంటర్ల కాపీలను అందరికీ అందచేస్తామని అభ్యర్థించారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు