కోర్టుకొచ్చే ముందు ‘డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌’ తప్పనిసరి

20 Sep, 2020 04:47 IST|Sakshi

అలా చేయకుండా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదు

అది ‘పిల్‌’ అయినా విచారించడానికి వీల్లేదు

హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు

సాక్షి, అమరావతి: సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా, ప్రభుత్వానికి ఎలాంటి వినతిపత్రాలు ఇవ్వకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తుండటం ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్న నేపథ్యంలో.. దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టే దిశగా రాష్ట్ర హైకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వానికి ఫలానా అంశంపై నిర్ధిష్టమైన ఆదేశం (మాండమస్‌) ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ముందు పిటిషనర్‌ ఆ అంశంపై ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించి ‘న్యాయాన్ని డిమాండ్‌’ (డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌) చేయడం తప్పనిసరని హైకోర్టు పేర్కొంది అలా న్యాయాన్ని డిమాండ్‌ చేయకుండా నేరుగా దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) అయినప్పటికీ దానిని విచారించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇలా న్యాయాన్ని డిమాండ్‌ చేయకుండా.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు మళ్లించిందని.. దీనిపై విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ బట్టు దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. 

ఆక్షేపించిన ధర్మాసనం
కేంద్ర నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు దారి మళ్లించిందని, దీనిపై విచారణకు ఆదేశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన జి.శరత్‌రెడ్డి గత ఏడాది జూన్‌లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారించింది. నిధుల మళ్లింపు విషయంలో పిటిషనర్‌ సరైన వివరాలు సమర్పించలేదని.. అంతేకాక, ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్‌ శరత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వినతిపత్రం ఇవ్వకపోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రభుత్వానికి ఫలానా ఆదేశం ఇవ్వండని న్యాయస్థానాలను ఆశ్రయించే ముందు.. ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను ‘డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌’ కోరడం తప్పనిసరి ధర్మాసనం స్పష్టంచేస్తూ శరత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు